Share News

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య..

ABN , Publish Date - Jul 30 , 2026 | 09:25 AM

అస్సాం రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఏడు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవగా.. 3 లక్షల మందికి పైగా ప్రజల జీవితం అస్తవ్యస్తమైంది. గడిచిన 24 గంటల వ్యవధిలో వరదలకు మరో ముగ్గురు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 78కి చేరింది.

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య..

గౌహతి: అస్సాం రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఏడు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవగా.. 3 లక్షల మందికి పైగా ప్రజల జీవితం అస్తవ్యస్తమైంది. గడిచిన 24 గంటల వ్యవధిలో వరదలకు మరో ముగ్గురు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 78కి చేరింది. వేల సంఖ్యలో పశువులు గల్లంతయ్యాయి. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ మేరకు భారీ వర్షాలు, వరదలపై అస్సాం ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది.


భారీ వర్షాలకు శివసాగర్, చరాయిదేవ్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, విశ్వనాథ్, కామరూప్ (మెట్రోపాలిటన్) జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏఎస్డీఎమ్ఏ) బులెటిన్ వెల్లడించింది. ఆయా జిల్లాల్లో 551 గ్రామాలు నీట మునిగాయని తెలిపింది. దీంతో మొత్తం 3,00,031 మంది ప్రజలు ప్రభావితమయ్యారని పేర్కొంది. గత 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృతిచెందారని ఏఎస్డీఎమ్ఏ అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు శివసాగర్ జిల్లాకు చెందినవారు కాగా, మరొకరు గోలాఘాట్‌కు చెందినవారని వివరించారు. దీంతో ఈ ఏడాది వరదల్లో చనిపోయిన వారి సంఖ్య 78కి చేరిందని చెప్పారు.


ఈ మేరకు 71 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి 16,500 మందికి పైగా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించారు. అలాగే మరో 30 సహాయక పంపిణీ కేంద్రాలు 72 వేల మందికి పైగా ప్రజలకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. మరోవైపు, 21,523.08 హెక్టార్ల పంట నీట మునిగిందని పేర్కొన్నారు. 11 వేలకు పైగా పశువులు కొట్టుకుపోయాయని, మరో 17 వేల మూగజీవాలు ప్రభావితమయ్యాయని ఏఎస్డీఎమ్ఏ బులెటిన్ తెలిపింది. అలాగే, వివిధ ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ ఆస్తులతో పాటు పలు మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నట్లు పేర్కొంది.


ఇదిలా ఉండగా, అస్సాంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో రాబోయే మూడు రోజుల్లో ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని వల్ల అస్సాంలోని టిన్సుకియా, ధేమాజీ, లఖింపూర్, శివసాగర్, జోర్హాట్, గోలాఘాట్ జిల్లాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే టిన్సుకియా జిల్లాకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. అంతేకాకుండా, నాగాలాండ్‌లోని మోన్, మోకోక్‌చుంగ్, వోఖా జిల్లాలకు కూడా 'ఆరెంజ్ అలర్ట్' జారీ అయ్యింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

థాయ్‌లాండ్‌లో భారతీయుల కిడ్నాప్ గ్యాంగ్ గుట్టురట్టు.. ఐదుగురి అరెస్ట్..

నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు

Updated Date - Jul 30 , 2026 | 09:35 AM