బోటు లేదు.. శిక్షణ లేదు.. 2 వేల ప్రాణాలు కాపాడిన శ్రావణ్..
ABN , Publish Date - Aug 02 , 2026 | 11:12 AM
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలోని పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. అలాంటి వేళ.. శ్రావణ్ కుమార్ దాదాపు 2 వేల మంది ప్రజలను కాపాడాడు. అయితే శ్రావణ్.. ఎక్కడ ఎటువంటి శిక్షణ తీసుకోలేదు. అతడికి బోటు కూడా లేదు. పైగా అతడు పదో తరగతి చదువుతూ మధ్యలో స్కూలు మానేశాడు.
గౌహతి, ఆగస్టు 02: ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలోని పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. అలాంటి వేళ.. శ్రావణ్ కుమార్ దాదాపు 2 వేల మంది ప్రజలను కాపాడాడు. అయితే శ్రావణ్.. ఎక్కడ ఎటువంటి శిక్షణ తీసుకోలేదు. అతడికి బోటు కూడా లేదు. పైగా అతడు పదో తరగతి చదువుతూ మధ్యలో స్కూలు మానేశాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అతడి పేరు మార్మోగుతోంది. జులై మూడో వారంలో బిహుబోర్‌లోని దిఖో నది ఒడ్డున అతడు నడిచి వెళ్తున్నాడు. ఆ ప్రాంతాంలోని ప్రజలు గ్యాస్ స్టవ్ వినియోగించరు. నదిలో నీటి ప్రవాహంలో దుంగలు కొట్టుకొస్తాయి. వాటిని సేకరించి.. ఇంటి చెరకుగా వినియోగిస్తారు.

అలా సేకరించిన ఆ దుంగలను విక్రయిస్తారు. అందుకోసం ఆ నది ఒడ్డున శ్రావణ్ నడిచి వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో నదిలో నీటి ప్రవాహ ఉధృతి ఒక్కసారిగా పెరిగినట్లు అతడు గుర్తించాడు. ఈ వరద నీరు ఆ పరివాహక ప్రాంతాలను ముంచేస్తూ ముందుకు సాగుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన అతడు.. వెంటన వెనక్కి పరిగెత్తుకొంటూ వెళ్లాడు. తన కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశాడు. దీంతో తల్లి, సోదరుడితో కలిసి ఇంట్లోని సామానులను సురక్షిత ప్రాంతాలకు తరలించాడు.

ఇరుగు పొరుగు వారిని కూడా అప్రమత్తం చేశాడు. అలా 5 గ్రామాల్లోని దాదాపు 2 వేల మందిని శ్రావణ్‌తోపాటు అతడి బృందం రక్షించింది. దాదాపు 24 గంటల పాటు ఈ బృందం కష్టపడి వీరందరిని రక్షించింది. వరద నీటి మట్టం బాగా పెరిగి ఇళ్లలోని భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో ఆ ఇళ్లలోని మహిళలు, గర్భిణీలు, వృద్ధులతోపాటు చిన్నారులు.. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పైకప్పుకు చేరారు. వారందరిని శ్రావణ్ సురక్షితంగా కాపాడారు.
ఈ వరదల కారణంగా.. శివసాగర్‌లోని నజీరా సహా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. గ్రామాలు నీట మునిగాయి. రహదారులు కొట్టుకుపోయాయి. విద్యుత్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ పూర్తిగా దెబ్బతింది. ఈ వరదలతో 1.78 లక్షల మంది బాధితులుగా మారారు. ఈ వరద ప్రభావానికి గురైన జిల్లాల సంఖ్య ఏడుకి పెరిగిందని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) వెల్లడించింది. ఈ వరదల కారణంగా.. మరణించిన వారి సంఖ్య 82కి చేరింది.
ఇది ఇలా ఉంటే.. గోలాఘాట్ జిల్లాలోని శివసాగర్ సమీపంలోని దిఖో నది, నుమాలిగఢ్ వద్ద ధన్‌సిరి నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోందని ఏఎస్‌డీఎంఏ వెల్లడించింది. గోలాఘాట్, శివసాగర్, చరాయిదేవ్, బజాలి, ధేమాజి, సోనిత్‌పూర్, జోర్హాట్ జిల్లాల్లోని 349 గ్రామాలను వరదలు ప్రభావితం చేశాయి. అయితే చరాయిదేవ్ జిల్లా మాత్రం తీవ్రంగా దెబ్బతింది. ఈ వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా 44 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసింది. అందులో 15 వేల మందికి ఆశ్రయం కల్పించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నీట్ పీజీ అభ్యర్థులకు పెద్ద ఊరట
For More National News And Telugu News