ముఖ్యమంత్రి పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా..
ABN , Publish Date - May 06 , 2026 | 01:33 PM
అస్సాం ముఖ్యమంత్రి పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు అందజేశారు.
దిస్‌పూర్: అస్సాం ముఖ్యమంత్రి పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు అందజేశారు. ఈరోజు (బుధవారం) లోక్ భవన్‌కు వెళ్లిన హిమంత బిశ్వశర్మ.. తన కేబినెట్ సహచరులతో కలిసి రాజీనామా చేశారు. దీంతో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సీఎం కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. రాజీనామాను ఆమోదించి, కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకూ శర్మను తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరినట్లు వెల్లడించింది.
రాజీనామా అనంతరం లోక్ భవన్ వెలుపల మీడియాతో హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు. మే 11 తర్వాత ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇది చరిత్రాత్మక విజయం కావడంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర పరిశీలకుల సమక్షంలో జరిగే బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో కొత్త సీఎంని ఎంపిక చేస్తారని శర్మ తెలిపారు. కాగా, 126 మంది సభ్యులున్న అస్సాం అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఒకే విడతలో ఎన్నికలు జరగగా.. మే 4న ఫలితాలు విడుదల అయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 102 స్థానాలను కైవసం చేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
కామాంధుడిని ఎన్‌కౌంటర్ చేసిన యూపీ పోలీసులు..
విజయ్‌కి అధికారికంగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్..