అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:57 AM
రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు. ఇందులో తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి - తిరువనంతపురం సూపర్‌ఫాస్ట్ రైలు కూడా ఉంది.
తిరువనంతపురం, జనవరి 23: రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇవాళ(శుక్రవారం) మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రాంతీయ రైలు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి ఆయన 3 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సహా నాలుగు కొత్త రైల్ సర్వీసులను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన రైళ్లలో తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి - తిరువనంతపురం సూపర్‌ఫాస్ట్ రైలు కూడా ఉంది.
ప్రధాని మోదీ జెండా ఊపిన అనంతరం.. తిరువనంతపురం సెంట్రల్ నుంచి రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. తిరువనంతపురం సెంట్రల్ నుంచి తాంబరం, నాగర్‌కోయిల్(తమిళనాడు) జంక్షన్ నుంచి మంగళూరు(కర్ణాటక) జంక్షన్ మధ్య రైళ్లు నడుస్తున్నాయి. ఇదే సమయంలో తిరువనంతపురం నార్త్ నుంచి చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 10:45 గంటలకు బయలుదేరింది. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేరళ సీఎం పినరయి విజయన్ పాల్గొన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రైళ్ల ప్రారంభోత్సవం ప్రాధాన్యం సంతరించుకుంది.
చర్లపల్లి (హైదరాబాద్) – తిరువనంతపురం
చర్లపల్లి (హైదరాబాద్) – తిరువనంతపురం మధ్య ప్రారంభమైన ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకసారి సర్వీసు అందిస్తుంది. రైలు నంబర్ 17041 ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 2:45 గంటలకు తిరువనంతపురం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 17042 ప్రతి బుధవారం సాయంత్రం 5:30 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరి, గురువారం రాత్రి 11:30 గంటలకు చర్లపల్లి చేరుతుంది.
నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవే:
నాగర్‌కోయిల్ - మంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
తిరువనంతపురం - తాంబరం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
తిరువనంతపురం - చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ కొత్త రైల్వే సేవలు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి.
ఇవీ చదవండి:
బ్రెజిల్ ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నా: ప్రధాని మోదీ
తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్