గుండారాజ్యం నుంచి గ్లోబల్ హబ్‌గా యూపీ: అమిత్ షా
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:52 PM
ఉత్తర్ ప్రదేశ్‌లో గతంలో రాజ్యమేలిన మాఫియాను యోగి ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. నోయిడాలో నిర్వహించిన 'యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2026' ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు.
నోయిడా (ఉత్తర్ ప్రదేశ్), సెప్టెంబర్ 25: ఉత్తర్ ప్రదేశ్‌లో గతంలో రాజ్యమేలిన మాఫియాను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఇప్పుడు పరిశ్రమలు, పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన వాతావరణాన్ని యోగీ సర్కారు సృష్టించిందని అమిత్ షా చెప్పారు. ఇవాళ (శుక్రవారం) నోయిడాలో నిర్వహించిన 'యుపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2026' ప్రారంభోత్సవంలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి యూపీలో 2017కి ముందున్న పరిస్థితులను, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన మార్పులను ప్రస్తావించారు.
గుండారాజ్యం నుంచి శాంతిభద్రతల వైపు
'2017కి ముందు రాష్ట్రంలో మాఫియా పాలన నడిచేది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శాంతిభద్రతలను పునరుద్ధరించారు. రౌడీయిజం, మాఫియా మూలాలను ఉపేక్షించకుండా తొలగించడమే ఈరోజు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు కారణం' అని అమిత్ షా తెలిపారు.
'2013లో అప్పటి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షించడానికి ఒక ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ఏర్పాటు చేయాలనుకుంది. కానీ లఖ్‌నవూలో శాంతిభద్రతలు క్షీణించడంతో ఆ కార్యక్రమాన్ని ఢిల్లీకి తరలించాల్సి వచ్చింది. అధికారులు కూడా లఖ్‌నవూ వాతావరణం బాగోలేదని ఒప్పుకున్నారు. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది' అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వం వల్లే ఈ అద్భుత పరివర్తన సాధ్యమైందని అమిత్ షా కొనియాడారు. ఈ భద్రత, స్థిరత్వం వల్లే ఉత్తర్ ప్రదేశ్ ఈరోజు 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడుసార్లు ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని రాజకీయ స్థిరత్వాన్ని అందించారని, దీనివల్ల విధాన నిర్ణయాలు వేగంగా అమలవుతున్నాయని అమిత్ షా చెప్పారు. పాలనానుభవంతో కొత్త పాలసీలు తెస్తూ భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మోదీ తీర్చిదిద్దారని అమిత్ షా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అమిత్ షా 'ODOP' (ఒకే జిల్లా - ఒకే ఉత్పత్తి) నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా యూపీ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా సొంత ఊర్లోనే ఉద్యోగాలు పొందుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ట్రేడ్ షో ద్వారా స్థానిక తయారీదారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
కేదార్‌నాథ్‌లో 5 నెలల్లోనే 50 టన్నుల చెత్త.. మూడేళ్ల కంటే ఇదే అధికం!
ఆసియా రికార్డు బద్దలు.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం