Share News

విజయ్‌కు మిత్రపక్షాల సెగ!

ABN , Publish Date - May 21 , 2026 | 05:59 AM

తమిళనాడు అధికార పార్టీ టీవీకేకు ఆదిలోనే తలనొప్పులు ఎదురయ్యాయి. అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా సీఎం విజయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు...

విజయ్‌కు మిత్రపక్షాల సెగ!

  • అన్నాడీఎంకే నేతలను మంత్రులుగా తీసుకోవద్దని డిమాండ్‌

  • కాదంటే మద్దతుపై పునరాలోచన చేస్తామని స్పష్టీకరణ

  • తమిళనాట నేడు మంత్రివర్గ విస్తరణ

చెన్నై, మే 20(ఆంధ్రజ్యోతి): తమిళనాడు అధికార పార్టీ టీవీకేకు ఆదిలోనే తలనొప్పులు ఎదురయ్యాయి. అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా సీఎం విజయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే.. ఊరుకునేది లేదని టీవీకేకు మద్దతు ఇస్తున్న సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీలు తేల్చి చెప్పారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకుంటే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయంపై పునరాలోచన చేస్తామని హెచ్చరించాయి. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సీపీఐ కార్యదర్శి వీరపాండ్యన్‌, వీసీకే అధినేత తిరుమావళవన్‌ ప్రకటించారు. బుధవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేసిన అన్నాడీఎంకే తరఫున వారు విజయం సాధించారని గుర్తు చేశారు. అలాంటి వారిని సీఎం విజయ్‌ తన మంత్రివర్గంలోకి తీసుకోవడం ఏమాత్రం సబబు కాదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోబోమని తమకు గతంలోనే టీవీకే నేతలు చెప్పారని తెలిపారు. ఆ హామీకి సీఎం విజయ్‌ కట్టుబడి ఉండాలన్నారు. మరోవైపు, గురువారం విజయ్‌ తన మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు లోక్‌భవన్‌లో గవర్నర్‌ అర్లేకర్‌ నూతన మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు. కాగా, టీవీకేకు మద్దతు ఇస్తున్న కాంగ్రె్‌సకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని విజయ్‌ నిర్ణయించారు. ఇక వీసీకే, ఐయూఎంఎల్‌లను కూడా మంత్రివర్గంలో చేరాలంటూ టీవీకే బహిరంగ ఆహ్వానం పంపింది. వారికి చెరొక మంత్రి పదవి ఇవ్వాలని విజయ్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, టీవీకే మంత్రివర్గం ఉమ్మడి కుటుంబంలా సామాజిక న్యాయం కోసం పాటుపడేలా ఉండాలని సీఎం విజయ్‌ భావిస్తున్నారని మంత్రి ఆదవ్‌ అర్జున తెలిపారు. అన్నాడీఎంకే అసమ్మతి వర్గాన్ని తాము మిత్రపక్షంగానే భావిస్తామన్నారు. అన్నాడీఎంకేలో చీలికలు ఉండకూడదనే తాము ఆశిస్తున్నామని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 21 , 2026 | 05:59 AM