ఇందిరాగాంధీ కన్నీళ్లు పెట్టుకున్నారు.. సోనియా గాంధీ వ్యాఖ్యలపై అకాలీదళ్ ఆగ్రహం!..
ABN , Publish Date - Nov 10 , 2026 | 08:51 AM
1984లో ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో జరిగిన విధ్వంసాన్ని చూసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తీవ్రంగా కలత చెందారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి.
ఇంటర్నెట్ డెస్క్: 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో జరిగిన విధ్వంసాన్ని చూసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తీవ్రంగా కలత చెందారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. సోనియా వ్యాఖ్యలపై శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా స్పందించింది. సిక్కుల బాధను అర్థం చేసుకోవాలంటే బాధిత కుటుంబాలను కలవాలని కాంగ్రెస్ నాయకత్వానికి సూచించింది. సోనియా గాంధీ తన కొత్త పుస్తకం 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' విడుదలకు ముందు బ్రిటన్కు చెందిన 'ది గార్డియన్' పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆపరేషన్ బ్లూస్టార్ గురించి ప్రస్తావించారు (Operation Blue Star).
ఆపరేషన్ బ్లూస్టార్ అనంతరం గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలో జరిగిన విధ్వంసానికి సంబంధించిన చిత్రాలను తన అత్త, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి చూపించారని సోనియా తెలిపారు. వాటిని చూసినప్పుడు ఇందిరాగాంధీ కళ్ల నుంచి కన్నీళ్లు వచ్చాయని వెల్లడించారు. ఆపరేషన్ అనంతరం ఇందిరాగాంధీకి ప్రాణహాని బెదిరింపులు వచ్చినట్లు కూడా సోనియా చెప్పారు. తనకు ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఏం చేయాలనే విషయాన్ని ఆమె ముందుగానే వివరించారని తెలిపారు. ధైర్యంగా ఉండాలని, ఏడవకూడదని రాహుల్ గాంధీకి చెప్పినట్లు సోనియా గుర్తుచేసుకున్నారు (1984 Anti Sikh Riots).

సోనియా వ్యాఖ్యలపై శిరోమణి అకాలీదళ్ అధికార ప్రతినిధి అర్ష్దీప్ సింగ్ క్లేర్ తీవ్రంగా స్పందించారు. ఆపరేషన్ బ్లూస్టార్ అనేది సిక్కు సమాజంపై, సిక్కుల అత్యున్నత ఆధ్యాత్మిక పీఠమైన శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్పై జరిగిన ప్రత్యక్ష దాడి అని వ్యాఖ్యానించారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను కూడా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ వల్ల సిక్కులకు జరిగిన నష్టాన్ని మాటల్లో వివరించలేమని అన్నారు. ఆ అల్లర్లలో అమాయకులు హత్యకు గురయ్యారని, అనేక కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయని ఆరోపించారు. బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి, వారి కష్టాలను తెలుసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వానికి సూచించారు (Akali Dal fires on Sonia Gandhi).
1984 జూన్లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయ సముదాయంలో ఉన్న వేర్పాటువాదులను తొలగించేందుకు భారత సైన్యంతో ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించింది. ఈ చర్యలో భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించాయి. ఈ ఆపరేషన్ దేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘటనల్లో ఒకటిగా నిలిచింది. అదే ఏడాది అక్టోబర్ 31న ఇందిరాగాంధీ తన ఇద్దరు సిక్కు భద్రతా సిబ్బంది చేతిలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత నవంబర్లో దేశవ్యాప్తంగా సిక్కులపై హింస చెలరేగింది. ఈ ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి..
ఎన్విడియా సీఈఓ వ్యవహారంపై ఎఫ్బీఐ దర్యాప్తు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..