అజిత్ పవార్ చివరి ట్వీట్ ఇదే
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:20 PM
దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్‌కి సెల్యూట్ చేస్తున్నానని, ఆయన దేశభక్తి తమకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తుందని అజిత్ పవార్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ముంబై: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంలో మృతిచెందడంతో రాష్ట్రంలో విషాద వాతావరణం నెలకొంది. బారామతి విమానాశ్రయం సమీపంలో చార్టర్డ్ విమానం కుప్పకూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత భద్రతాధికారి విదీప్ జాదవ్, ఇద్దరు పైలట్లు సుమిత్ కుమార్, శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ అక్కడికక్కడే మృతి చెందారు. విమానం క్రాష్ కావడానికి ముందు అజిత్ పవార్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతి రాయ్ (Lala Lajapat Rai) జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక ట్వీట్ చేశారు. అదే ఆయన చివరి ట్వీట్ అయింది.
దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్‌కి సెల్యూట్ చేస్తున్నానని, ఆయన దేశభక్తి తమకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తుందని ఆ ట్వీట్‌లో అజిత్ పవార్ పేర్కొన్నారు. లాలా లజపతి రాయ్ 1865 జనవరి 28న జన్మించారు.
అజిత్ పవార్ ఫిబ్రవరి 5న జరుగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం బహిరంగ సభలో పాల్గొనేందుకు ముంబై నుంచి బారామతి వెళ్తుండగా విమాన ప్రమాదం జరిగింది. అజిత్ పవార్ మృతికి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో నివాళులు వెల్లువెత్తాయి. చివరిసారిగా ఆయన చేసిన ట్వీట్‌ను ఒకరు ప్రస్తావిస్తూ... '48 నిమిషాల క్రితమే మీరు ట్వీట్ చేశారు..ఇప్పుడు మీరే లేరంటే జీవితం ఎంత అనిశ్చితమో అర్ధమవుతోంది. మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను' అని నివాళులర్పించారు. పవార్‌కు భార్య సునేత్ర (రాజ్యసభ సభ్యురాలు), ఇద్దరు కుమారులు పార్థ్, జై ఉన్నారు. అజిత్ పవార్ నేషనలిస్ట్ పార్టీ (ఎన్‌సీపీ) ఇటీవల పుణె, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన అంకుల్ శరద్ పవార్ (ఎన్‌సీపీ-ఎస్‌పీ)తో కలిసి పోటీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అజిత్ పవార్ మృతిలో కుట్రకోణం... మమత సంచలన వ్యాఖ్యలు
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి
For More National News And Telugu News