Share News

నాడు ఆపరేషన్ సిందూర్‌లో వీరోచిత పోరు.. నేడు ఫైటర్‌ జెట్‌ ప్రమాదంలో మృతి..

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:09 PM

అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్‌లో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్ కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోగా.. వారిలో ఒకరైన ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్ ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నట్లుగా..

నాడు ఆపరేషన్ సిందూర్‌లో వీరోచిత పోరు.. నేడు ఫైటర్‌ జెట్‌ ప్రమాదంలో మృతి..

న్యూఢిల్లీ, మార్చి 6: అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్‌లో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్ కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోగా.. వారిలో ఒకరైన ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్ ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నట్లుగా సమాచారం. ఈ విషయాన్ని పూర్వేష్ తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు.

పూర్వేష్(28).. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ముందుగా ఈ విషయం తమకు తెలియదని.. ఆపరేషన్ సిందూర్ ముగిసిన 15 రోజుల తరువాత తెలిసిందని పూర్వేష్ తండ్రి రవీంద్ర దురాగ్కర్ తెలిపారు. యుద్ధ సమయంలో పూర్వేష్ వద్ద ఫోన్ లేదని.. యుద్ధం ముగిసిన తరువాత పూర్వేష్ తమకు కాల్ చేసి విషయం చెప్పాడని రవీంద్ర తెలిపారు.


అస్సాంలో ప్రమాదం జరగడానికి ఒక రోజు ముందు తన కొడుకుతో మాట్లాడినట్లు రవీంద్ర తెలిపారు. ఇంతలోనే ఇలా జరిగిందంటూ కన్నీరమున్నీరయ్యారు. తన కొడుకు భారత వైమానిక దళంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉందన్నారు. పూర్వేష్ ఎప్పుడు మాట్లాడినా యుద్ధ విమానాలను నడిపిన తన అనుభవాన్ని, ఐఏఎఫ్ జెట్‌ల వేగం గురించి ఎంతో ఆసక్తిగా చెబుతుండేవాడని.. తన సహోద్యోగులను ఎంతో గౌరవించేవాడని రవీంద్ర తెలిపారు. ‘నా కొడుకు దేశ సేవలో తనను తాను త్యాగం చేసుకున్నాడు. పూర్వేష్ తన కలను నెరవేర్చుకున్నాడు. కానీ, తను కోరుకున్నంతగా దేశానికి సేవ చేయలేకపోయాడు. కేవలం 4 సంవత్సరాలు మాత్రమే పని చేశాడు. పది రోజుల క్రితం మా ఇంటికి వచ్చాడు. తిరిగి విధుల్లోకి చేరిన తరువాత ఇలా జరిగింది.’ అంటూ రవీంద్ర విలపించారు.


ప్రమాదం ఎలా జరిగింది..?

ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్, స్క్వాడ్రన్ లీడర్ అనుజ్ SU-30 MKIలో శిక్షణా మిషన్‌లో ఉన్నారు. జోర్హాట్ వైమానిక స్థావరం నుండి వీరి జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కనిపించకుండా పోయింది. సాయంత్రం 7:42 గంటలకు సుఖోయ్‌తో కమ్యూనికేషన్ కోల్పోయినట్లు తెలిపిన అధికారులు.. జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో కూలిపోయినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.


ఆపరేషన్ సిందూర్..

పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(LeT)లో భాగమైన రెసిస్టెన్స్ ఫ్రంట్.. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రదాడికి తెగపడిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. భారత భద్రతా దళాలు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌(పీఓకే)లో ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో 100మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తరువాత పాకిస్థాన్.. భారత్‌పై క్షిపణులు, డ్రోన్‌లతో దాడులకు తెగబడగా.. భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. ప్రతిదాడులతో పాక్‌ను షేక్ చేశాయి. మే 10వ తేదీన ఇరు దేశాలూ కాల్పుల విరమణ ప్రకటించాయి. దాంతో ఆపరేషన్ సిందూర్ నిలిచిపోయింది.


Also Read:

ప్రైవేట్ బస్సు బోల్తా పడి స్పాట్‌లో ఐదుగురి దుర్మరణం

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: అహ్మదాబాద్ పిచ్‌పై ఆందోళన.. ఆ సెంటిమెంట్‌కు భారత్ చెక్ పెడుతుందా?

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్

Updated Date - Mar 06 , 2026 | 05:26 PM