Share News

ఏఐతో ఐదేళ్లలో 2.4 కోట్ల ఉద్యోగాలకు ఎసరు!

ABN , Publish Date - Nov 28 , 2026 | 03:56 AM

ఆఫీసులలో సహోద్యోగిగా అడుగుపెట్టిన కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ఉద్యోగాల లెక్కలను మార్చే స్థాయికి చేరుతోంది

ఏఐతో ఐదేళ్లలో 2.4 కోట్ల ఉద్యోగాలకు ఎసరు!
jobholder

  • ప్రపంచవ్యాప్తంగా మేధోపరమైన ఉద్యోగాల్లోఏటా 1.3 శాతం తగ్గిపోయే చాన్స్‌: జేపీ మోర్గాన్‌ అంచనా

  • ఎస్‌ఏపీలో 10 వేల పోస్టుల కోతపై కసరత్తు

  • హెచ్‌ఎస్‌బీసీ భారత్‌ పునర్వ్యవస్థీకరణ..

  • హైదరాబాద్‌, పుణెలలో వందల ఉద్యోగాలపై ప్రభావం!

  • స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో 340 మందికి ఉద్వాసన

న్యూఢిల్లీ, నవంబరు 27: ఆఫీసులలో సహోద్యోగిగా అడుగుపెట్టిన కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ఉద్యోగాల లెక్కలను మార్చే స్థాయికి చేరుతోంది. మనుషులు చేసే పనులను వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేయగల సామర్థ్యం ఏఐకి పెరుగుతుండటంతో సంస్థలు నియామకాలను తగ్గించడంతోపాటు ఉద్యోగాల కోతకు దిగుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 2.4 కోట్ల ఉద్యోగాలకు ఎసరు వచ్చే అవకాశం ఉందని జేపీ మోర్గాన్‌ అంచనా వేయగా.. జర్మనీకి చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ఎస్‌ఏపీ 10 వేల ఉద్యోగాల కోతకు చర్యలు చేపట్టింది. హెచ్‌ఎ్‌సబీసీ భారత్‌లో చేపట్టిన పునర్వ్యవస్థీకరణతో వందలాది ఉద్యోగాలపైప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్‌ 340 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్‌ తాజాగా విడుదల చేసిన తమ అవుట్‌లుక్‌-2027 నివేదికలో ఏఐ కారణంగా ఉద్యోగాలపై పడే ప్రభావాన్ని అంచనా వేసింది. చాలా సంస్థలు మనుషులకు బదులుగా ఏఐతో చేయగల పనులపై దృష్టిపెడుతున్నాయని, ఏఐపై చేసే ఖర్చులో సగం మేరకు దీనిపైనే వెచ్చిస్తున్నాయని తెలిపింది. ఇలా ఏఐతో పనులు చేయించడం వల్ల ఉద్యోగుల కోసం అయ్యే ఖర్చులో సగం మాత్రమే ఉంటుందని భావిస్తే.. వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.4 కోట్ల మేధోపరమైన (నాలెడ్జ్‌) ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా అమెరికాలోనే 1.6 కోట్ల ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని వివరించింది.


ai2.jpgప్రపంచంలోని నాలెడ్జ్‌ ఉద్యోగాల్లో ఏటా సుమారు 1.3 శాతం మేర తగ్గుదల సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఉద్యోగులను నేరుగా తొలగించడం కంటే.. ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోవడం, కొత్త నియామకాలను తగ్గించడం వంటి మార్పులు ఉండవచ్చని తెలిపింది.

ఎస్‌ఏపీలో 10 వేల మందికి ఉద్వాసన?

జర్మనీకి చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ఎస్‌ఏపీ (సాప్‌) కూడా ఏఐ ఆధారిత పునర్వ్యవస్థీకరణలో భాగంగా కనీసం 10 వేల ఉద్యోగాలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 9శాతం మందిపై ప్రభావం పడవచ్చని సాప్‌ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్‌, బ్లూమ్‌బర్గ్‌ కథనాలు ప్రచురించాయి. ఏఐ వినియోగం, అన్ని విభాగాల్లోనూ ఖర్చులను తగ్గించడమే ఈ కోతల లక్ష్యమని పేర్కొన్నాయి. అయితే దీనిపై సాప్‌ సంస్థ అధికారికంగా స్పందించలేదు.

హెచ్‌ఎస్‌బీసీలో వందల పోస్టులకు ముప్పు

బ్రిటన్‌కు చెందిన బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌ఎ్‌సబీసీ కూడా ఏఐ వినియోగం, వ్యయ నియంత్రణలో భాగంగా తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తోంది. భారత్‌లోని గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) ఆర్థిక విభాగాలకు చెందిన ఉద్యోగాలను చెన్నై, గురుగ్రామ్‌, బెంగళూరుకు కేంద్రీకరించాలని నిర్ణయించింది. దీనితో హైదరాబాద్‌, పుణె కేంద్రాల్లోని కొన్ని ఉద్యోగాలు రద్దయ్యే అవకాశం ఉందని.. వందలాది ఉద్యోగులపై ప్రభావం పడొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభావిత ఉద్యోగులకు ఇతర నగరాలకు బదిలీ అయ్యే అవకాశం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఇక హెచ్‌ఎ్‌సబీసీ ప్రపంచవ్యాప్తంగా చేపట్టనున్న పునర్వ్యవస్థీకరణలో 20 వేల ఉద్యోగాలపై కోత ఉండొచ్చని బ్లూమ్‌బర్గ్‌ అంచనా వేసింది.


ఇన్‌స్టామార్ట్‌లో 340 మంది తొలగింపు

దేశీయంగా వేగంగా విస్తరిస్తున్న క్విక్‌ కామర్స్‌ రంగంలోనూ ఏఐ ప్రభావం కనిపిస్తోంది. స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్స్‌ 340 ఉద్యోగాలకు కోత పెడుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఏఐ వినియోగం, పనితీరులో మార్పులు, విభాగాల మధ్య ఒకే విధమైన బాధ్యతలను తగ్గిస్తూ చేపట్టిన పునర్విభజన వంటివి ఈ నిర్ణయానికి కారణాలని సంస్థ వర్గాలు వెల్లడించాయి. తొలగించిన ఉద్యోగులకు కొంత పరిహారం, కొంతకాలం ఆరోగ్య బీమా కొనసాగింపు వంటి సదుపాయాలను ఇవ్వనున్నట్టు తెలిపాయి.

ఈ వార్తలూ చదవండి

నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం

త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా

Updated Date - Nov 28 , 2026 | 03:57 AM