బలవంతపు పెళ్లి, వేధింపుల కారణంగానే విడాకులు.. ఖర్గే వ్యాఖ్యలకు దేవెగౌడ కౌంటర్
ABN , Publish Date - Mar 18 , 2026 | 09:42 PM
కాంగ్రెస్‌తో 2019లో జరిగిన వివాహం వేధింపుల కారణంగానే విడాకులతో ముగిసిందని మాజీ ప్రధానమంత్రి, జనతా దళ్ సెక్యులర్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ చెప్పారు.
బెంగళూరు: కాంగ్రెస్‌తో 2019లో జరిగిన వివాహం వేధింపుల కారణంగానే విడాకులతో ముగిసిందని మాజీ ప్రధానమంత్రి, జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gowda) చెప్పారు. దేవెగౌడ పార్టీ కాంగ్రెస్‌తో ప్రేమ వ్యవహారం నడిపి బీజేపీని పెళ్లి చేసుకుందంటూ రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Khrge) బుధవారంనాడు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో దేవెగౌడ స్పందించారు.
మల్లికార్జున్ ఖర్గే మాట్లాడినప్పుడు తాను పార్లమెంటులో లేనని దేవెగౌడ చెబుతూ, ఖర్గే వాడిని భాషలోనే కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌తో తనది బలవంతపు పెళ్లి అని, ఆ సంబంధంలో ఎదురైన వేధింపుల కారణంగానే తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. 2019లో ఎమ్మెల్యేలు సామూహికంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం, దాంతో హెచ్‌డీ కుమారస్వామి సారథ్యంలోని కర్ణాటక కూటమి ప్రభుత్వం కుప్పకూలడం, కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు విచ్ఛిన్నం కావడం వంటి పరిణామాలను దేవెగౌడ్ తన పోస్టులో ప్రస్తావించారు.
'2018 నాటి పరిణామాలు ఖర్గేకు గుర్తుండే ఉంటాయి. గులాం నబీ ఆజాద్‌ను కాంగ్రెస్ పార్టీ పంపి, కుమారస్వామికి సీఎం ఆఫర్ ఇచ్చింది. అందుకు నేను ఒప్పుకోలేదు. ఖర్గే సీఎం కావాలని అందరిముందూ నేను చెప్పాను. అప్పుడు సిద్ధరామయ్య కూడా అక్కడే ఉన్నారు. అయితే కుమారస్వామి నాయకత్వం కోసం ఆజాద్ పట్టుబట్టారు. ఆర్భాటంగా పెళ్లి చేసిన తర్వాత 2019లో ఏం చేశారు? కుప్పతొట్టిలోకి నెట్టేశారు. ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించారు? వారిని పంపిందెవరు? అనేది అందరికీ తెలిసిన విషయమే. ఫిరాయింపులను ప్రోత్సహించిన వ్యక్తిపై ఆరోజే కాంగ్రెస్ చర్య తీసుకుని ఉంటే, ఇవాళ నా మిత్రుడు ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడుగా మంచి పొజిషన్‌లో ఉండేవారు' అని దేవెగౌడ పేర్కొన్నారు.
ఖర్గే ఏమన్నారు?
పదవీకాలం ముగిసిన రాజ్యసభ సభ్యుల వీడ్కోలు సెషన్‌లో ఖర్గే బుధవారంనాడు మాట్లాడుతూ, మాజీ ప్రధాని దేవెగౌడ 54 ఏళ్లుగా తనకు తెలుసునని, కలిసి పనిచేశామని అన్నారు. దేవెగౌడ గతంలో కాంగ్రెస్‌తో ప్రేమలో ఉండి, ఇప్పుడు మోదీని పెళ్లి చేసుకున్నారని, అందుకు కారణం తనకు తెలియదని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రేమ మాతో, పెళ్లి మోదీతో.. రాజ్యసభలో ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్