Share News

Maharashtra Civic Polls: 'మహా' పోల్స్ డే.. మరాఠీ కార్డుతో ఠాక్రేలు, అభివృద్ధి ఎజెండాతో ఫడ్నవిస్

ABN , Publish Date - Jan 14 , 2026 | 09:52 PM

మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో 227 వార్డుల్లో ఓటింగ్ జరుగుతుంది. సుమారు 1,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీఎంసీ ఎన్నికల్లో 1,03,44,315 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

Maharashtra Civic Polls: 'మహా' పోల్స్ డే.. మరాఠీ కార్డుతో ఠాక్రేలు, అభివృద్ధి ఎజెండాతో ఫడ్నవిస్
Maharashtra Civic Polls

ముంబై: మహారాష్ట్ర పురపోరు (Civic Polls)కు సర్వం సిద్ధమైంది. బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు గురువారంనాడు పోలింగ్ జరుగనుంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ కీలక ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విస్తృత ప్రచారం సాగించాయి. మహాయుతి కూటమి గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఈ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని చెబుతుండగా, ఐక్యంగా బరిలోకి దిగిన ఠాక్రే సోదరులు సైతం గెలుపుపై ధీమాతో ఉన్నారు. 16వ తేదీ శుక్రవారంనాడు ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.


మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో 227 వార్డుల్లో ఓటింగ్ జరుగుతుంది. సుమారు 1,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీఎంసీ ఎన్నికల్లో 1,03,44,315 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 55 లక్షలకు పైగా పురుషులు, 48 లక్షలకు పైగా మహిళలు, ఇతర ఓటర్లు 1,099 మంది ఉన్నారు. అవిభక్త శివసేన బీఎంసీకి కంచుకోటగా ఉండేది. బీజేపీతో పొత్తుతో గతంలో పోటీ చేసిన 84 స్థానాల్లో 82 సీట్లు ఈ కూటమి గెలుచుకుంది. అయితే 2022లో శివసేన రెండుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలో కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పునురుద్ధరించాలనే పట్టుదలతో ఠాక్రే సోదరులు రాజ్, ఉద్ధవ్‌లు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తు్న్నారు.


ఎంఎన్‌ఎస్ తొలిసారి 2009లో బీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 19 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత నుంచి ఎంఎన్ఎస్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చీలిక వచ్చిన థాకరే సారథ్యంలోని శివసేన (యూబీటీ) గత అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి దెబ్బతింది. 288 స్థానాల్లో కేవలం 20 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఠాక్రే సోదరులు ఇరువురూ పురపోరులో చేతులు కలపడం ఆసక్తిని రేపుతోంది. ఠాక్రేలున్నంత వరకూ మరాఠీ ప్రజలకు రక్షణ ఉంటుందంటూ మరాఠీ కార్డుతో ఠాక్రే సోదరులు ప్రచారం సాగించగా, ముంబై అభివృద్ధి కార్డుతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రచారం సాగించారు. బీఎంసీ ఎన్నికల్లో ఏక్‌నాథ్ షిండే శివసేనతో కలిసి బీజేపీ పోటీలో ఉంది. బీఎంసీ సహా మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో మహాయుతి విక్టరీ సాధిస్తుందని, బీఎంసీ మేయర్ పదవిని మహాయుతి కూటమి చేపడుతుందని ఫడ్నవిస్ ధీమా వ్యక్తం చేశారు. ముంబైలో ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూడా బరిలో ఉన్నప్పటికీ ఈ పార్టీల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని చెబుతున్నారు. ప్రధాన పోటీ మహాయతి, ఠాక్రే సోదరుల మధ్యే ఉంటుదని అంచనా వేస్తు్న్నారు. ఠాక్రేలతో శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ (ఎన్‌సీ) జతకట్టింది. అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ పుణె, పింప్రి చించ్వాడ్‌లో ఎన్‌సీపీ (ఎస్‌పీ)తో కలిసి పోటీ చేస్తోంది.


ఇవి కూడా చదవండి..

అయోధ్యలో పర్యటించనున్న పార్లమెంటరీ కమిటీ.. సభ్యులలో రాహుల్ గాంధీ

ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. భారతీయులకు ఎంబసీ అలర్ట్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 14 , 2026 | 09:54 PM