Indian Embassy Advisory: ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. భారతీయులకు ఎంబసీ అలర్ట్
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:21 PM
ఇరాన్‌ను వీడాలని భారతీయులకు అక్కడి ఇండియన్ ఎంబసీ తాజాగా సూచించింది. అందుబాటులో ఉన్న ప్రయాణ సాధనాల ద్వారా ఇరాన్‌ను వీడాలని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు అంతకంతకూ తీవ్రమవుతున్న వేళ అక్కడి భారతీయ ఎంబసీ కీలక అలర్ట్ జారీ చేసింది. ఇరాన్‌లోని భారతీయులు, భారత సంతతి వ్యక్తులు దేశాన్ని వీడాలని సూచించింది. తమకు అందుబాటులో ఉన్న ప్రయాణ సాధనాల ద్వారా ఇరాన్‌ను వీడాలని పేర్కొంది. నిరసనలతో ఉద్రిక్తంగా మారిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని కూడా సూచించింది. నిత్యం తమతో టచ్‌లో ఉండాలని చెప్పింది. తాజా పరిస్థితులను గురించి తెలుసుకునేందుకు స్థానిక మీడియా వార్తలను జాగ్రత్తగా గమనిస్తుండాలని కూడా సూచించింది (Indian Embassy in Iran - Advisory).
ఇరాన్‌లో ఉంటున్న భారతీయులు ఎల్లవేళలా తమ పాస్‌పోర్టు, ఐడీ, ఇతర ధ్రువీకరణ పత్రాలను రెడీగా పెట్టుకోవాలని కూడా భారతీయ ఎంబసీ పేర్కొంది. ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా భారతీయ ఎంబసీని సంప్రదించాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో భారతీయులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లను కూడా ఎంబసీ షేర్ చేసింది. ఫోన్ నెంబర్లు: +989128109115; +989128109109; +989128109102; +989932179359. ఈమెయిల్: cons.tehran@mea.gov.in. ద్వారా సంప్రదించి, సాయం పొందాలని పేర్కొంది.
ఇక ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోని భారతీయులు వెంటనే నమోదు చేసుకోవాలని చెప్పింది. https://www.meaers.com/request/home వెబ్‌సైట్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవల్లో ఆటంకాల కారణంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయలేకపోయిన వారు భారత్‌లోని తమ కుటుంబసభ్యుల సాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ఎంబసీ సూచించింది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ కూడా భారతీయులను అప్రమత్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ వెళ్లొద్దని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
ఛత్తీస్‌గఢ్‌లో 29 మంది మావోయిస్టుల లొంగుబాటు
పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ