DK Shivakumar : డీకేతో ఢీ కొట్టించాలి!
ABN , First Publish Date - 2023-06-16T03:39:35+05:30 IST
బలమైన అధికార పార్టీని ఎదుర్కోవడానికి వీలుగా కాంగ్రెస్ అన్ని అస్త్రాలను సంధించాలని నిర్ణయించింది.
తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా శివకుమార్?
కేసీఆర్‌కు దీటుగా రంగంలోకి రాజకీయ వ్యూహకర్త
అన్ని గ్రూపులను ఏకతాటిపైకి తీసుకెళ్లే ప్రయత్నం
అధిష్ఠానం యోచన.. త్వరలో నిర్ణయం
ఇప్పటికే బెంగళూరుకు వరుస కడుతున్న నేతలు
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): బలమైన అధికార పార్టీని ఎదుర్కోవడానికి వీలుగా కాంగ్రెస్ అన్ని అస్త్రాలను సంధించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సేవలను తెలంగాణలో ఉపయోగించుకోవాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ వేసే రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కదిద్ది నాయకులను, కేడర్‌ను ఏకతాటిపైకి తీసుకెళ్లే విధంగా డీకే సేవలు ఉపయోగపడుతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఆర్థిక పరమైన వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో కూడా పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతలు డీకేతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో డీకే శివకుమార్ పోషించిన పాత్ర అందరికీతెలిసిందే. పార్టీ నేతల మధ్య సమన్వయం కుదుర్చడం, కేడర్‌లో జోష్‌ను పెంచడం, ఎన్నికల ప్రచారంలో ముందుండి, ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకాన్ని కలిగించడంలో ఆయన పాత్ర కీలకమైనది.
ఈ విషయాన్ని గుర్తించిన పార్టీ అధిష్ఠానం శివకుమార్ సేవలను తెలంగాణలోనూ వినియోగించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ సరిహద్దును పంచుకుంటున్న కర్ణాటక ప్రభావం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. డీకే నియామకం ద్వారా కర్ణాటక సరిహద్దులోని తెలంగాణ జిల్లాల్లో ఎన్నికలను ఎదుర్కోవడం సులువు అవుతుందని భావిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో తెలంగాణ కాంగ్రె్‌సలోనూ కొత్త జోష్ మొదలైంది. అప్పటివరకు జోరుగా ఉన్న బీజేపీ గాలి కొంత తగ్గినట్లయింది. ఈ అనుకూల పరిస్థితిని మరింత మెరుగు పరుచుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తోంది. అందులో భాగంగానే శివకుమార్‌కు తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మధ్య టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు, కాంగ్రెస్ పార్టీలోకి రావాలని భావిస్తున్న పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదరరెడ్డి వంటి వారు వేర్వేరుగా బెంగుళూరు వెళ్లి డీకేతో సమావేశమైనట్లు సమాచారం. ఇప్పటికే వైఎస్సాఆర్‌టీపీ అధినేత షర్మిల కూడా డీకేను కలుసుకుని చర్చించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఇన్‌చార్జిగా ఆయన వస్తున్నారని తెలిసే.. ఇక్కడి నేతలు ఆయన్ను కలుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జిగా డీకేను నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రయోజనాలు అనేకం
డీకే శివకుమార్ నియామకం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని కాంగ్రెస్ అధిష్ఠానం అంచనా వేస్తోంది. రాష్ట్ర పార్టీలో అంతర్గతంగా పలు సమస్యలు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీనియర్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. పార్టీ వేగంగా ముందుకు వెళుతున్న ప్రతిసారీ ఈ అంతర్గత విభేదాలతో తలనొప్పులు ఎదురవుతున్నాయి. మరోపక్క ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతల చేరికల విషయంలో కూడా తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. ఎన్నికల్లో నిధుల సమీకరణ కూడా ముఖ్యమైనదే కావడంతో.. ఆ బాధ్యతను కూడా డీకే సమర్థంగా నిర్వహిస్తారనే నమ్మకంతో అధిష్ఠానం ఆయన వైపు మొగ్గు చూపుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్‌సభకు సాధారణ ఎన్నికలు రానున్నాయి.
లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొవాలంటే.. అంతకుముందు జరిగే తెలంగాణ, ఇతర రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యమన్న భావన పార్టీ అధినాయకత్వంలో ఉంది. నేతల మధ్య విభేదాల వంటి చిన్న చిన్న కారణాలతో ఇలాంటి సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకోవద్దనే ఉద్దేశంతో డీకేను తెలంగాణకు పంపించాలని భావిస్తున్నారు. మరోపక్క ఎన్నికలకు అయ్యే వ్యయం విషయంలో అధికార బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే.. డీకే వంటి వారి నుంచే సాధ్యమవుతుందని హైకమాండ్ భావిస్తోంది. సోనియా, రాహుల్, ప్రియాంకలతో డీకేకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఇక్కడి పార్టీ వ్యవహారాలను ఆయన స్వతంత్రంగా, సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.