Share News

డీలిమిటేషన్ బిల్లు.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు మద్దతిస్తారా..

ABN , Publish Date - Nov 27 , 2026 | 05:11 PM

టీఎంసీ నుంచి విడిపోయిన 20 మంది తిరుగుబాటు ఎంపీలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తమకు నచ్చిన విధంగా ఓటు వేసేందుకు అవకాశం ఉందని లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి.

డీలిమిటేషన్ బిల్లు.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు మద్దతిస్తారా..
Rebel TMC MPs

ఇంటర్నెట్ డెస్క్: డీ-లిమిటేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తున్న వేళ తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీల మద్దతు గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీఎంసీ నుంచి విడిపోయిన 20 మంది తిరుగుబాటు ఎంపీలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తమకు నచ్చిన విధంగా ఓటు వేసేందుకు అవకాశం ఉందని లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి. వారిపై ప్రస్తుతం అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అయినప్పటికీ స్పీకర్ అధికారికంగా అనర్హులుగా ప్రకటించేంత వరకు వారి ఓటు హక్కుకు ఎలాంటి ఆటంకం ఉండదని లోక్‌సభ వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం (Rebel TMC MPs).


నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 20 మంది టీఎంసీ ఎంపీల ఓట్లు ప్రభుత్వానికి కీలకంగా మారనున్నాయి. టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు ఈ ఏడాది జూన్‌లో పార్టీ నుంచి విడిపోయి, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)లో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. వీరిపై టీఎంసీ లోక్‌సభ పక్ష నేత అభిషేక్ బెనర్జీ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు (Delimitation Bill 2026).


ఆరు నెలలు గడుస్తున్నా ఈ పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో అధికారిక రికార్డుల్లో వారింకా ఎంపీలుగానే కొనసాగుతున్నారు. స్పీకర్ అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకునేంత వరకు ఆ 20 మంది ఎంపీలకు పార్లమెంట్‌లో పాల్గొనే హక్కుతో పాటు ఓటు హక్కు కూడా ఉంటుంది. 20 మంది ఎంపీలపై అనర్హత పిటిషన్లు దాఖలై ఆరు నెలలు గడిచినా స్పీకర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సాగరికా ఘోష్ విమర్శించారు. 'డీలిమిటేషన్ బిల్లుపై వారు వేసే ఓట్లను చట్టబద్ధంగా పరిగణించవచ్చా?' అని ప్రశ్నించారు (20 Rebel MPs).


కాగా, ఈ 20 మంది తిరుగుబాటు ఎంపీల మద్దతు ఎన్డీయే ప్రభుత్వానికి అత్యంత కీలకం (Parliament Voting). రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. గత ఏప్రిల్‌లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులు లోక్‌సభలో అవసరమైన మెజారిటీ సాధించలేకపోయాయి. ఈసారి కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు వివిధ పార్టీల మద్దతు కూడగడుతోంది. ఈ నేపథ్యంలో 20 మంది టీఎంసీ తిరుగుబాటు ఎంపీల మద్దతు కీలకంగా మారింది.


ఇవి కూడా చదవండి..

అది మీ బాధ్యత.. మదురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం..


మూడేళ్లకు రూ.50 లక్షల కోట్లకు పైగా.. రష్యా చరిత్రలోనే భారీ రక్షణ బడ్జెట్..

Updated Date - Nov 27 , 2026 | 05:19 PM