Share News

లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది జవాన్లు మృతి

ABN , Publish Date - Jan 22 , 2026 | 03:28 PM

జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ వాహనం అదుపుతప్పి ఓ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది జవాన్లు మృతి
Army Vehicle Crash

జమ్మూ కశ్మీర్‌, జనవరి 22: జమ్మూకశ్మీర్‌లోని(Jammu Kashmir accident) దోడా సెక్టార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న ఓ ఆర్మీ వాహనం అదుపుతప్పి 200 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే సైన్యం, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన ఉధంపూర్ మిలటరీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


మొత్తం 17 మంది సైనికులతో కూడిన ఆర్మీ వాహనం ఓ హై ఆల్టిట్యూడ్ పోస్టుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భదేర్వా-చంబా అంతర్రాష్ట్ర రహదారి వెంబడి ఖన్నీ టాప్ దగ్గర డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం 200 అడుగల లోయలో పడినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గాయపడిన వారిలో పలువురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పది మంది సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.


లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సంతాపం..

ఈ ప్రమాదాన్ని జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌' వేదికగా వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ‘దోడాలో జరిగిన దురదృష్టకర ఘటనలో 10 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం. మన సైనికుల అత్యుత్తమ సేవ, త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అని సిన్హా పోస్ట్ చేశారు. ఈ ఘటనలో మరి కొంతమంది సైనికులు గాయపడగా.. వారిని ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలించారు. వీరందరికీ ఉత్తమ చికిత్స అందించాలంటూ అధికారులను ఆదేశించిన ఎల్జీ.. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం!

హీరో విజయ్ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ

Read Latest National News And Telugu News

Updated Date - Jan 22 , 2026 | 03:52 PM