తమిళ హీరో విజయ్ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:12 PM
తమిళగ వెట్రి కళగం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తును కేటాయించింది. గురువారం టీవీకే పార్టీకి ‘ఈల’ గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ, జనవరి 22: తమిళ స్టార్ హీరో విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం పార్టీ(TVK)కి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తును కేటాయించింది. గురువారం టీవీకే పార్టీకి ‘విజిల్(ఈల)’ గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. 2026లో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఈల గుర్తు మీద పోటీ చేయనుంది. ఈసీ తమ పార్టీకి ఈల గుర్తు కేటాయించిన నేపథ్యంలో విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జోరుగా పార్టీ కార్యకలాపాలు..
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా విజయ్.. టీవీకే పార్టీని అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు. గత మంగళవారం చెన్నైలో ఎన్నికల ప్రచార కమిటీకి సంబంధించిన మొదటి మీటింగ్ జరిగింది. సామాజిక న్యాయం, పారదర్శకతలకు పెద్ద పీట వేస్తూ టీవీకే పార్టీ మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2026 ఏప్రిల్ నుంచి మే మధ్య కాలంలో జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి.
ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా.. ఏఐడీఎమ్‌కే ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టేసింది. ప్రజలపై హామీల జల్లులు కురిపిస్తోంది. టీవీకే పార్టీ పెద్ద పార్టీలతో పొత్తులేకుండానే ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. ఒంటరిగా పోటీచేస్తే టీవీకే ప్రభావం అంతగా ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలిసారి ఒంటరిగా పోటీ చేయటం కంటే పొత్తులో ముందుకెళితేనే కలిసొచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి.. జనసైనికులకు పవన్ దిశానిర్దేశం