తెలిసిన వారి పేర్లు మర్చిపోయే అలవాటు మీకూ ఉందా..? దీనికి కారణమిదే!
ABN , Publish Date - Nov 21 , 2026 | 06:42 AM
కొత్తగా ఎవరినైనా కలిసినప్పుడు పరిచయం చేసుకుంటాం. వారు తమ పేరు చెబుతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ పేరును పరిచయం తరువాత మర్చిపోతాం.
ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా ఎవరినైనా కలిసినప్పుడు పరిచయం చేసుకుంటాం. వారు తమ పేరు చెబుతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ పేరును పరిచయం తరువాత మర్చిపోతాం. ఎంత ప్రయత్నించినా అది గుర్తుకు రాదు. ముఖం స్పష్టంగా గుర్తున్నా పేరు మాత్రం మర్చిపోతుంటాం. ఇలాంటి అనుభవం చాలామందికి ఎదురవుతుంది. దీంతో తమ జ్ఞాపకశక్తి తగ్గుతోందేమోనని ఆందోళన చెందుతుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనికి ప్రతిసారీ బలహీనమైన జ్ఞాపకశక్తే కారణం కాదు. ఆ సమయంలో మనం ఎంత శ్రద్ధగా వింటున్నామనేదే ముఖ్యమైన విషయం.
పేరు ఎందుకు గుర్తుండటం లేదు?
న్యూరాలజీ నిపుణుల ప్రకారం.. కొత్త వ్యక్తిని కలిసినప్పుడు మన మెదడు ఒకేసారి అనేక విషయాలపై దృష్టి పెడుతుంది. ఎలా పలకరించాలి? తరువాత ఏం మాట్లాడాలి? చుట్టూ ఏం జరుగుతోంది? వంటి ఆలోచనలతో మన దృష్టి మళ్లిపోతుంది. ఈ క్రమంలో ఎదుటివారు చెప్పిన పేరు మెదడులో సరిగ్గా నమోదుకాదు. అందుకే కొద్దిసేపటికే ఆ పేరు మర్చిపోతుంటాం.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
'న్యూరోబయాలజీ ఆఫ్ ఏజింగ్' జర్నల్లో ప్రచురితమైన పరిశోధన కూడా ఈ అంశాన్ని ప్రస్తావించింది. కొన్ని సందర్భాల్లో మనం విన్న విషయాలను మెదడు నమోదు చేయదని ఆ పరిశోధన వివరించింది. దీనిని 'ఎన్కోడింగ్' (Encoding) సమస్యగా నిపుణులు వివరిస్తున్నారు. కొన్నిసార్లు సమాచారం మెదడులో నమోదైనప్పటికీ, దాన్ని గుర్తు చేసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. దీన్ని 'రిట్రీవల్' (Retrieval) సమస్య అంటారు. కాబట్టి పేర్లు మర్చిపోవడం ప్రతిసారీ జ్ఞాపకశక్తి కోల్పోవడానికి సంకేతం కాదు.
పేర్లు గుర్తుంచుకోవడానికి ఏం చేయాలి?
కొన్ని చిన్న అలవాట్లతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
శ్రద్ధగా వినండి: కొత్త వ్యక్తిని కలిసినప్పుడు ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా వారి పేరు వినడానికి ప్రయత్నించండి.
పేరును మరోసారి పలకండి: పరిచయం చేసుకున్న వెంటనే సంభాషణలో వారి పేరును ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల పేరు గుర్తుండే అవకాశం ఉంటుంది.
ఇలా గుర్తుంచుకోవచ్చు: ఆ పేరును మీకు తెలిసిన వ్యక్తి లేదా మరో పరిచయమైన విషయంతో పోల్చి గుర్తుంచుకోండి.
ఇవీ చదవండి
ఐస్క్రీమ్ వర్సెస్ ఫ్రోజన్ డెజర్ట్.. వీటి మధ్య తేడా ఏంటో తెలుసా?
యమునా నది కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం