Share News

యమునా నది కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

ABN , Publish Date - Nov 16 , 2026 | 07:20 PM

యమునా నది కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నదిని శుభ్రం చేయండి లేదా భారీ జరిమానాలకు సిద్ధంకండి అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాలు, జిల్లాలపై బాధ్యత వేస్తూ కీలక ఆదేశాలిచ్చింది.

యమునా నది కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
Yamuna pollution Supreme Court

ఆంధ్రజ్యోతి, నవంబర్ 16: యమునా నది ప్రక్షాళన కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ కాలుష్యం తగ్గకపోగా మరింత పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నదీ తీరంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పౌర పాలన వైఫల్యాలే ఈ దుస్థితికి కారణమని మండిపడింది. ఇకపై ఏ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం లేదా జిల్లా పరిధిలోనైనా నీటి నాణ్యత క్షీణిస్తే సంబంధిత ప్రభుత్వాలనే బాధ్యులను చేసి జరిమానాలు విధిస్తామని ధర్మాసనం గట్టిగా హెచ్చరించింది.

ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ధోరణికి స్వస్తి పలికేలా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. యమునా నది, ప్రధాన డ్రెయిన్లు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాల్లోకి ప్రవేశించేటప్పుడు, అలాగే బయటకు వెళ్లేటప్పుడు నీటి నాణ్యతను పర్యవేక్షించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని (CPCB) ఆదేశించింది. ఏ రాష్ట్రం లేదా జిల్లా పరిధిలో నీటి నాణ్యత పడిపోయినా ఆయా ప్రభుత్వాలనే బాధ్యులను చేసి జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. జరిమానా లేదా పరిహారాన్ని లెక్కించేందుకు ఒక ఫార్ములాను సూచించాలని సీపీసీబీకి సూచించింది. ఆ సొమ్మును సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో జమ చేయాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, కాలుష్య కారకాల నుంచి ప్రభుత్వాలు ఆ మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చని తెలిపింది.


520 డ్రెయిన్ల మురుగు.. ఆక్రమణలపై ఆందోళన

నది తీరంలోని పౌర సంస్థల నిర్లక్ష్యానికి యమునా నదిలో కలుస్తున్న 520 మురుగునీటి డ్రెయిన్లే నిదర్శనమని ధర్మాసనం పేర్కొంది. కేవలం మురుగునీటి శుద్ధి కర్మాగారాలు (STPs) నిర్మించినంత మాత్రాన నది శుభ్రపడదని, పారిశ్రామిక వ్యర్థాలు, శుద్ధి చేయని మురుగునీటిని మూలాల వద్దే అడ్డుకోవాలని స్పష్టం చేసింది. అనధికార కాలనీలు, మురికివాడల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడాన్ని కోర్టు ప్రస్తావించింది. డ్రెయిన్లు, నదీ గర్భంలోని ఆక్రమణలను తొలగించి, నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోతే మురుగునీరు నదిలో కలవడం ఆగదని అభిప్రాయపడింది.

స్మార్ట్ మీటర్లు, లైవ్ డేటా: అన్ని మురుగునీటి శుద్ధి కర్మాగారాలు (STPs), కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (CETPs), ప్రభుత్వ బయోగ్యాస్ ప్లాంట్లలో నెల రోజుల్లోగా ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ ఎనర్జీ మీటర్లను ఏర్పాటు చేయాలి. అలాగే ప్లాంట్ల పనితీరు, విడుదలయ్యే నీటి నాణ్యత వివరాలను లైవ్‌లో అప్‌లోడ్ చేయాలి.

ఆకస్మిక తనిఖీలు: ఐఐటీలు (IITs), ఎన్ఐటీలు (NITs) వంటి స్వతంత్ర సంస్థల సహాయంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నీటి నమూనాలను సేకరించే అధికారాన్ని సీపీసీబీకి అప్పగించింది. నదిలో చేపలు చనిపోవడం, తెల్లటి నురుగు తేలడం, నాచు పేరుకుపోవడం, BOD, COD వంటి కాలుష్య సూచికలు పెరగడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీపీసీబీని ఆదేశించింది.

మే 2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు సీపీసీబీ చేసిన పర్యవేక్షణలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో 12 ప్రధాన కాలుష్య హాట్‌స్పాట్‌లను గుర్తించారు. 32 చోట్ల ఘన వ్యర్థాలు పేరుకుపోయాయని, 11 డ్రెయిన్ల వద్ద మురుగునీటి మళ్లింపు వ్యవస్థ నెలల తరబడి పనిచేయడం లేదని నివేదిక వెల్లడించింది. కాగా, ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరి 13, 2027 కు వాయిదా వేసింది. (Yamuna pollution Supreme Court)


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Updated Date - Nov 16 , 2026 | 08:00 PM