Offbeat Places Near Manali: ప్రకృతి ప్రేమికులకు పర్ఫెక్ట్.. ఈ అద్భుతమైన ఆఫ్‌బీట్ ప్లేస్‌లకు వెళ్లాల్సిందే!
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:27 PM
హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అయితే, నగరానికి దూరంగా ప్రశాంతంగా గడపాలనుకునే వారికి మనాలి సమీపంలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ రహస్య ప్రదేశాలను సందర్శిస్తే మీ మనాలి ట్రిప్ మరింత ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా మారుతుంది..
ఇంటర్నెట్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక అందమైన హిమాలయాల హిల్ స్టేషన్ మనాలి. ఇది పచ్చని లోయలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, నదులు, జలపాతాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, హడింబా దేవి ఆలయం వంటి ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది, దీనిని దేవతల లోయ అని కూడా పిలుస్తారు. ఇది పర్యాటకులు, హనీమూన్ జంటలు, సాహస ప్రియులకు ఒక ప్రముఖ గమ్యస్థానం. అయితే, నగరానికి దూరంగా ప్రశాంతంగా గడపాలనుకునే వారికి మనాలి సమీపంలో అద్భుతమైన ఆఫ్‌బీట్ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలను సందర్శిస్తే మీ మనాలి ట్రిప్ మరింత ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా మారుతుంది.

సజ్లా గ్రామం..
మనాలి నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సజ్లా గ్రామం ఇప్పటికీ తన సంప్రదాయ జీవనశైలిని కాపాడుకుంటోంది. పాత చెక్క ఇళ్లు, ఆపిల్ తోటలు, ప్రశాంత వాతావరణం.. ఇవన్నీ మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామం. ఇక్కడ ఉన్న అందమైన సజ్లా జలపాతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే విష్ణు ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఈ ప్రాంతానికి మనాలి నుంచి బస్సు లేదా టాక్సీ ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

షాంఘర్ గ్రామం..
షాంఘర్ సైంజ్ లోయలో ఉంది. ఇది నెమ్మదిగా విదేశీ పర్యాటకుల్లో కూడా ప్రాచుర్యం పొందుతోంది. విస్తారమైన పచ్చని పొలాలు, దేవాలయాలు, చుట్టూ ఉన్న పైన్ అడవులు ఈ ప్రదేశానికి ప్రత్యేక ఆకర్షణ. మనాలి నుంచి బస్సు లేదా టాక్సీలో సైంజ్ లోయకు చేరుకుని అక్కడి నుంచి షాంఘర్‌కు వెళ్లొచ్చు.

రాణి నాలా..
రోహ్‌తాంగ్ పాస్ వైపు వెళ్లే దారిలో వచ్చే ఈ ప్రదేశం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. రాణి నాలా చాలా చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. పర్వతాల నుంచి ప్రవహించే నీరు, చుట్టూ పచ్చదనం.. ఇవన్నీ కలిపి ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి. చిన్న పిక్నిక్ లేదా కాస్త విశ్రాంతి కోసం ఇది మంచి ప్రదేశం. మనాలి–లేహ్ హైవే (NH3) మీదుగా బస్సు, టాక్సీ లేదా స్వంత వాహనంలో వెళ్లవచ్చు.

పాండు రోపా..
ఇది చాలా తక్కువ మందికి తెలిసిన ప్రశాంతమైన ప్రదేశం. ఇక్కడికి చేరుకోవడానికి కొద్దిగా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. పాండవులకు ఈ ప్రాంతంతో సంబంధం ఉందని స్థానికులు చెబుతారు. సుమారు 3500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం పైన్ అడవులతో చుట్టుముట్టబడి ఉంటుంది. ఇక్కడి సహజ సౌందర్యం, నిశ్శబ్ద వాతావరణం మనసుకు చాలా హాయిని ఇస్తుంది.
ఈసారి మీరు మనాలికి వెళ్తే మాల్ రోడ్, సోలాంగ్ వ్యాలీతోనే సరిపెట్టుకోకుండా… ఈ రహస్య ప్రదేశాలను కూడా తప్పక సందర్శించండి. ఇవి మీ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా చేస్తాయి.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News