కార్తీక మాసం ప్రత్యేకం.. ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు
ABN , Publish Date - Nov 16 , 2026 | 11:54 AM
అత్యంత పవిత్రమైందిగా భావించే కార్తీక మాసంలో భక్తులు ప్రసిద్ధ శివాలయాలను సందర్శించాలని అనుకుంటారు. ప్రముఖ శైవ క్షేత్రాలకు వెళ్లి శివయ్య దర్శనభాగ్యం పొందాలని కోరుకుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: అత్యంత పవిత్రమైందిగా భావించే కార్తీక మాసంలో భక్తులు ప్రసిద్ధ శివాలయాలను సందర్శించాలని అనుకుంటారు. ప్రముఖ శైవ క్షేత్రాలకు వెళ్లి శివయ్య దర్శనభాగ్యం పొందాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో పవిత్ర దేవాలయాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పలు సర్వీసులను ప్రారంభించింది. ఈ బస్సులతో దక్షిణాదిలోని పేరుగాంచిన శైవ క్షేత్రాలకు సులభంగా వెళ్లిరావచ్చు.
అరుణాచలానికి వెళ్లేందుకు..
తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం ఈ నెల (నవంబర్) 23న హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సు కదలనుంది. దారి మధ్యలో కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ వద్ద బస్సు ఆగుతుంది. దీంతో ఈ ఆలయాలనూ సందర్శించొచ్చు. అరుణాచలం నుంచి తిరుగు ప్రయాణంలో గద్వాల్‌లోని జోగులాంబ ఆలయాన్ని దర్శించుకునేలా ఆర్టీసీ అధికారులు యాత్రను రూపొందించారు. అదే నెల 27న బస్సు హనుమకొండ చేరుకుంటుంది.
శబరిమలకు ఇలా
కేరళంలోని శబరిమలకు వెళ్లే అయ్యప్ప మాలధారణలో ఉన్న భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను తీసుకొచ్చింది. 36 మంది స్వాములు కలిసి బస్ బుక్ చేసుకుంటే.. అధికారులు ఒక బస్‌ను కేటాయిస్తారు. ఈ సర్వీసులో ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక వంటమనిషికి ఉచిత ప్రయాణం కల్పిస్తారు.
పంచారామ క్షేత్రాల కోసం..
ఆంధ్రాలో పంచారామ క్షేత్రాలుగా ప్రఖ్యాతి పొందిన అమరలింగేశ్వరుడు(అమరావతి), సోమేశ్వరస్వామి (భీమవరం), క్షీర లింగేశ్వరస్వామి(పాలకొల్లు), భీమలింగేశ్వరస్వామి (సామర్లకోట), భీమేశ్వరస్వామి (ద్రాక్షారామం) ఆలయాలను సందర్శించేందుకు ప్రతి ఆదివారం హనుమకొండ నుంచి ప్రత్యేక బస్సులు ఉన్నాయి. ఒకే రోజు ఈ ఐదు క్షేత్రాలనూ దర్శించుకుంటే మహాపుణ్యమని విశ్వాసం ఉంది. దీంతో పంచారామ క్షేత్రాలను ఒకే రోజు సందర్శించేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ యాత్ర టికెట్ ధర పెద్దలకు రూ.2,300గా, చిన్నారులకు రూ.1,500గా నిర్ణయించింది. మరిన్ని వివరాల కోసం 96521 24049 నంబరును సంప్రదించండి.
ఈ వార్తలూ చదవండి
కార్తీక మాసం.. తొలి సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు!
శబరిమల భక్తులకు శుభవార్త.. ఇండియా పోస్ట్ ద్వారా ఇంటికే అయ్యప్ప ప్రసాదం