శబరిమల భక్తులకు శుభవార్త.. ఇండియా పోస్ట్ ద్వారా ఇంటికే అయ్యప్ప ప్రసాదం
ABN , Publish Date - Nov 14 , 2026 | 04:25 PM
శబరిమల భక్తులకు శుభవార్త! సన్నిధానం నుంచే అరవణ, అప్పం వంటి ప్రసాదాలను ఇండియా పోస్ట్ ద్వారా ఇంటికే పంపించుకోవచ్చు. నవంబర్ 17 నుంచి ప్రత్యేక కౌంటర్ ప్రారంభం.
తిరువనంతపురం (కేరళం), నవంబర్ 14: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు తపాలా శాఖ (India Post), ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) శుభవార్త అందించాయి. భక్తులు తిరుగు ప్రయాణంలో ప్రసాదాలను మోసుకెళ్లే ఇబ్బంది లేకుండా, సన్నిధానం నుంచే నేరుగా తమ ఇంటి చిరునామాలకు అరవణ పాయసం, అప్పం తదితర ప్రసాదాలను పంపించుకునేందుకు వీలుగా ఇండియా పోస్ట్ ప్రత్యేక బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తోంది.
నవంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న 41 రోజుల మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ కోసం ఈ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. శబరిమల ఆలయ ప్రాంగణంలోని దేవస్వం బోర్డు అరవణ, అప్పం కౌంటర్ల పక్కనే తపాలా శాఖ 24 గంటల ప్రత్యేక పార్శిల్ బుకింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తుంది. తపాలా శాఖకు చెందిన స్పీడ్ పోస్ట్ పార్శిల్ సేవ ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడికైనా భక్తుల ఇంటి గుమ్మం వద్దకే సురక్షితంగా ప్రసాదాలను డెలివరీ చేస్తారు.
భారీ రద్దీ ఉండే సమయంలో భక్తులు తమ వెంట ఎన్ని ప్రసాదం ప్యాకెట్లనైనా తీసుకెళ్లే భారం తప్పుతుంది. సన్నిధానంలో బుక్ చేసుకుంటే, భక్తులు తమ యాత్ర ముగించుకుని ఇంటికి చేరుకునే సమయానికి ప్రసాదం పార్శిళ్లు ఇంటికి చేరుతాయి.
దేశవ్యాప్త పోస్టాఫీసుల ద్వారా కూడా: కేవలం సన్నిధానంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల ద్వారా కూడా భక్తులు ప్రసాదాన్ని బుక్ చేసుకుని భారత్‌లోని ఏ ప్రాంతానికైనా పంపించుకునే వెసులుబాటు కల్పించారు.
ఈ ఏడాది మండల పూజల కోసం అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకునే సమయానికి (వచ్చే వారం నుంచి) ఈ ప్రత్యేక పార్శిల్ బుకింగ్ కేంద్రం పనిచేయడం ప్రారంభిస్తుందని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్, కేరళ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అమితాబ్ సింగ్ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. సులభమైన బుకింగ్, సురక్షితమైన ప్యాకేజింగ్, నమ్మకమైన డెలివరీతో ఈ సేవ భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. (Sabarimala Prasadam Home Delivery)
ఈ వార్తలనూ చదవండి:
జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్
ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..