Share News

తత్కాల్ టికెట్‌కు రీఫండ్ వస్తుందా?

ABN , Publish Date - Feb 06 , 2026 | 01:38 PM

తత్కాల్ టికెట్‌కు రీఫండ్ వస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం తత్కాల్ టికెట్ రద్దుపై ఉన్న రీఫండ్ నియమాలు ఏమిటి, ఎలాంటి సందర్భాల్లో రీఫండ్ వస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

తత్కాల్ టికెట్‌కు రీఫండ్ వస్తుందా?
Tatkal Ticket Cancellation Rules

ఇంటర్నెట్ డెస్క్: తత్కాల్ టికెట్ (Tatkal Ticket ) చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సిన వారికి ఇది ఒక అవకాశం. ఈ టికెట్లు ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు ప్రారంభమవుతాయి. కానీ ఒకసారి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రయాణం రద్దు చేయాల్సి వస్తే, రీఫండ్ రాకపోవడం చాలా మందిని నిరాశకు గురి చేస్తోంది. అయితే, భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం తత్కాల్ టికెట్ రద్దుపై ఉన్న రీఫండ్ నియమాలు ఏమిటి, ఎలాంటి సందర్భాల్లో రీఫండ్ వస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


రైల్వే నిబంధనలు ఏమిటి?

భారత రైల్వే నిబంధనల ప్రకారం, కన్ఫర్మ్ అయిన తత్కాల్ టికెట్‌ను రద్దు చేస్తే సాధారణంగా ఎలాంటి రీఫండ్ ఉండదు. ప్రయాణం చేసినా చేయకపోయినా టికెట్‌కు చెల్లించిన డబ్బులు రిటర్న్ చేయరు. టికెట్‌ను రద్దు చేసుకోవడం సాధ్యమే కానీ డబ్బు రిఫండ్ అవకాశం మాత్రం ఉండదు. చాలా మంది తత్కాల్ టికెట్లు కూడా సాధారణ టికెట్లలానే రద్దు చేస్తే డబ్బు వస్తుందని అనుకుంటారు. కానీ వాస్తవానికి తత్కాల్ టికెట్ రద్దు అంటే సీటును మాత్రమే వదులుకోవడం కాదు.. డబ్బును కూడా వదులుకోవాల్సి వస్తుంది.

నో-రీఫండ్ విధానం ఎందుకు ?

రైల్వేలు ఈ విధానాన్ని ప్రధానంగా దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి తీసుకొచ్చాయి. తత్కాల్ టికెట్ రద్దు చేసినా రీఫండ్ ఇస్తే, అవసరం లేకపోయినా చాలా మంది టికెట్లు బుక్ చేసి తర్వాత రద్దు చేస్తారు. దీని వల్ల నిజంగా అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారికి సీట్లు దొరకకుండా పోతాయి. ఈ పరిస్థితిని నివారించేందుకే తత్కాల్ టికెట్లపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అలాగే, రైలు బయలుదేరే సమయానికి రెండు గంటల తర్వాత కన్ఫర్మ్ టికెట్ రద్దు చేసినా రీఫండ్ ఉండదు.


తత్కాల్ టికెట్‌కు రీఫండ్ ఎప్పుడు వస్తుంది?

  • కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం రీఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది. చార్ట్ తయారయ్యే సమయానికి తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ కాకుండా వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే, టికెట్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. అప్పుడు పూర్తి రీఫండ్ వస్తుంది.

  • రైలు పూర్తిగా రద్దయితే, కన్ఫర్మ్ అయిన తత్కాల్ టికెట్ ఉన్నా ప్రయాణికుడికి మొత్తం డబ్బు తిరిగి చెల్లిస్తారు.

  • రైలు మూడు గంటలకంటే ఎక్కువ ఆలస్యమైతే, ప్రయాణం చేయకుండా TDR దాఖలు చేస్తే కొన్ని సందర్భాల్లో రీఫండ్ లభించవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

తత్కాల్ టికెట్ బుక్ చేసే ముందు ఈ నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకసారి కన్ఫర్మ్ అయితే, చాలా సందర్భాల్లో రీఫండ్ ఆశించడం కష్టమే. అవసరం ఉన్నప్పుడే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం ప్రయాణికులకు మేలు చేస్తుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 06 , 2026 | 03:04 PM