Share News

తలస్నానం చేసిన రెండో రోజే మీ జుట్టు జిడ్డుగా మారుతోందా?

ABN , Publish Date - Feb 05 , 2026 | 08:47 AM

తలస్నానం చేసిన మరుసటి రోజు మీ జుట్టు జిడ్డుగా మారుతుందా? ఈ సమస్య ఎందుకు వస్తుందో, దాన్ని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

తలస్నానం చేసిన రెండో రోజే మీ జుట్టు జిడ్డుగా మారుతోందా?
Oily Hair After Head Bath

ఇంటర్నెట్ డెస్క్: తలస్నానం చేసిన రెండో రోజుకే మీ జుట్టు జిడ్డుగా మారుతోందా? మీరు తెలియకుండా చేస్తున్న కొన్ని తప్పులే ఇందుకు కారణం కావచ్చు. తలపై సేబాషియస్ గ్రంథులు ఉంటాయి. ఇవి సహజ నూనె అయిన సెబమ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ నూనె జుట్టు తేమను కాపాడుతుంది, తల చర్మం పొడిబారకుండా చేస్తుంది. దురద, జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుంది. కానీ కొంతమందిలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల జుట్టు చాలా త్వరగా జిడ్డుగా మారుతుంది. హార్మోన్ల మార్పులు, నాణ్యత లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తుల వాడకం కూడా దీనికి కారణాలు కావచ్చు.

సెబమ్ ఎక్కువైతే తలస్నానం చేసిన తర్వాత కూడా జుట్టు జిడ్డుగా కనిపిస్తుంది. అలాగే తలపై మురికి పేరుకుపోయి రంధ్రాలు మూసుకుపోతాయి. దీని వల్ల దురద, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు రావచ్చు. ఇప్పుడు జుట్టు త్వరగా జిడ్డుగా మారడానికి కారణమయ్యే కొన్ని సాధారణ తప్పులను చూద్దాం..


దిండు కవర్ మార్చకపోవడం

చాలా మంది దిండు కవర్లను తరచుగా మార్చరు. దిండు కవర్‌పై మురికి, నూనె పేరుకుపోతాయి. ప్రతిరోజూ అదే దిండు మీద పడుకోవడం వల్ల అవి మళ్లీ జుట్టుకు అంటుకుని జుట్టు జిడ్డుగా మారుతుంది. సిల్క్ లేదా శాటిన్ దిండు కవర్లు వాడితే జుట్టు విరిగిపోవడం కూడా తగ్గుతుంది.

కండిషనర్ సరిగా వాడకపోవడం

కండిషనర్ జుట్టును మృదువుగా ఉంచుతుంది. కానీ దానిని నెత్తిమీద రాయడం లేదా ఎక్కువగా వాడడం వల్ల జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. కండిషనర్‌ను ఎప్పుడూ జుట్టు మధ్య భాగం నుంచి చివరల వరకు మాత్రమే వాడాలి. మీ జుట్టు రకానికి సరిపోయే షాంపూ, కండిషనర్ ఎంచుకోవడం ముఖ్యం.


దువ్వెన శుభ్రం చేయకపోవడం

శుభ్రంగా లేని దువ్వెన వాడితే జుట్టు వెంటనే మురికిగా, జిడ్డుగా మారుతుంది. దువ్వెనను వారానికి కనీసం రెండు సార్లు గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. లేకపోతే జుట్టు సమస్యలు పెరుగుతాయి.

జుట్టును పదే పదే తాకడం

జుట్టును తరచూ తాకే అలవాటు కూడా జుట్టు జిడ్డుగా మారడానికి కారణం. చేతులకున్న మురికి, నూనె జుట్టుకు అంటుకోవడం వల్ల జుట్టు త్వరగా జిడ్డుగా మారి, దుమ్మును ఆకర్షిస్తుంది.

తల చర్మాన్ని సరిగా శుభ్రం చేయకపోవడం

చాలా మంది తలస్నానం చేసేటప్పుడు షాంపూను జుట్టు చివరలనే ఎక్కువగా రుద్దుతారు. కానీ నిజానికి శుభ్రం చేయాల్సింది తల చర్మం. తల సరిగా శుభ్రం కాకపోతే మురికి పేరుకుపోయి జుట్టు జిడ్డుగా కనిపిస్తుంది. ఎక్కువ షాంపూ వాడటం వల్ల కూడా జుట్టు పొడిబారిపోతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మార్కెట్లో కల్తీ అల్లం.. కొనేముందు ఇది తెలుసుకోండి.!

ఇలాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులే

For More Latest News

Updated Date - Feb 05 , 2026 | 09:58 AM