Share News

మార్కెట్లో కల్తీ అల్లం.. కొనేముందు ఇది తెలుసుకోండి.!

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:43 AM

ఆరోగ్యానికి మేలు చేసే అల్లం ఇప్పుడు మార్కెట్లో కల్తీగా లభిస్తోంది. మెరిసేలా కనిపించేందుకు రసాయనాలు వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి అల్లం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. మరి రసాయనాలతో కలిపిన అల్లాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..

మార్కెట్లో కల్తీ అల్లం.. కొనేముందు ఇది తెలుసుకోండి.!
Chemically Treated Ginger

ఇంటర్నెట్ డెస్క్: అల్లం (Ginger) అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలోని 'జింజెరాల్' అనే సమ్మేళనం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వికారం, వాంతులు, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. జలుబు, జ్వరాల నుంచి ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడుతుంది. వంటలలో, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ, పచ్చళ్లలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆహారానికి ప్రత్యేక రుచిని ఇస్తుంది.


అల్లంలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. తక్కువ మొత్తంలో తిన్నా ఇవి శరీరానికి మేలు చేస్తాయి. కానీ రసాయనాలతో కలిపిన అల్లం మాత్రం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అందుకే స్వచ్ఛమైన అల్లాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు మార్కెట్లో అల్లం కల్తీగా వస్తోంది. అందుకే అల్లం కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మెరుపు చూసి మోసపోకండి

అల్లంలోకి నేరుగా రసాయనాలు ఇంజెక్ట్ చేయరు. అల్లంను కట్ చేసిన తర్వాత కొన్ని రసాయనాల నీటిలో వాటిని నానబెట్టి మెరిసేలా చేస్తారు. ఇలా చేస్తే అల్లం బాగా కనిపిస్తుంది కాబట్టి మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్మగలుగుతారు. అందుకే మార్కెట్లో చాలా శుభ్రంగా, మెరిసే అల్లం కనిపిస్తే వెంటనే కొనేయకండి. చాలా తెల్లగా లేదా లేత పసుపు రంగులో ఉండి, తొక్క చాలా పలుచగా కనిపిస్తే అది రసాయనాలతో శుభ్రం చేసిన అల్లం కావచ్చు. నిజమైన అల్లం మాత్రం కొంచెం మసకగా, లేత గోధుమ రంగు తొక్కతో ఉంటుంది. కొద్దిగా మట్టితో కప్పబడి కూడా ఉండొచ్చు.


అల్లాన్ని నొక్కి చూడండి

అల్లం కొనేటప్పుడు చేతితో నొక్కి చూడండి. అది గట్టిగా, బలంగా ఉంటే మంచిది. మెత్తగా లేదా స్పాంజీలా ఉంటే, అది పాతదై ఉండవచ్చు లేదా రసాయనాల్లో నానబెట్టిన అల్లం కావచ్చు.

వాసన చూసి గుర్తించండి

కొన్ని సార్లు అల్లంలా కనిపించే ఇతర మొక్కల వేర్లను కూడా అల్లంలా అమ్ముతారు. అల్లాన్ని కొంచెం పగలగొట్టి వాసన చూడండి. ఘాటైన వాసన వస్తే అది నిజమైన అల్లం. అసహజంగా వాసన వస్తే అది కల్తీ అయి ఉండే అవకాశం ఉంది. అవసరమైతే చిన్న ముక్కను రుచి చూసి కూడా అల్లం నిజమైనదా కాదా తెలుసుకోవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 04 , 2026 | 11:54 AM