Sankranti Cockfights: సంక్రాంతి.. కోడి పందేల సందడి.. జర భద్రం.!
ABN , Publish Date - Jan 13 , 2026 | 03:12 PM
సంక్రాంతి అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందేలు. ముఖ్యంగా పండుగకు కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణ. భోగి నుంచి కనుమ వరకూ ఎక్కడ చూసినా పందేల హడావిడి ఉత్కంఠగా కనిపిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. ఇంటింటా పిండివంటల సువాసనలు, ముంగిట ముగ్గులు, ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు, వీధుల్లో హరిదాసుల గానాలు.. ఈ అన్నింటితో గ్రామాలు కళకళలాడిపోతుంటాయి. బసవన్న విన్యాసాలు, కర్రసాము, కత్తిసాము, డప్పు కళాకారులు హోరెత్తించే ప్రదర్శనలు, కోలాటం, పులివేషాలు.. ఇలా ప్రతి మూలా ఓ సంబరం కనిపిస్తుంటుంది. అయితే.. అన్నింటికీ మించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది కోడి పందేలు.
గ్రామీణ సంస్కృతిలో కోడి పందేలు, ఎడ్ల పందేలు కేవలం ఆటలు మాత్రమే కావు. అవి ఓ ఉత్సవం, ఓ వేడుక, ఓ సామూహిక ఆనందం. భోగి నుంచి కనుమ వరకూ పల్లెల్లో జరిగే ఈ పందేలను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు.. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచీ జనం పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా.. విదేశాల్లో ఉన్న తెలుగువారిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందాయి. అక్కడి పందేల హడావిడి, ఏర్పాట్లు, గెలుపు ఓటముల ఉత్కంఠ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొందరికి ఇది సంప్రదాయం, మరికొందరికి వినోదం, ఇంకొందరికి గెలుపు ఓటముల ఉత్కంఠ. ఈ పందేలతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది.

అయితే.. ఇటీవలి కాలంలో కోడి పందేల్లో మనుషులు గాయపడటం, ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. కోడి కత్తులు ప్రేక్షకులకు తగలడం, గొడవలు జరగడం.. దీనివల్ల దాడులకు దిగడం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఈ సంప్రదాయం ఇప్పుడు భద్రతా కోణంలో పెద్ద చర్చకు దారితీస్తోంది. కాబట్టి ఈ కోడి పందేల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

జాగ్రత్తలు:
చాలా చోట్ల కోడి పందేలు నిషేధం. కాబట్టి చట్టాన్ని గౌరవించండి. ఎందుకంటే పోలీస్ కేసులు, అరెస్ట్‌లు, జరిమానాలు వంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది.
పందేల్లో డబ్బు ఎక్కువగా పెట్టకండి. పందెంలో ఓడిపోతే కుటుంబంలో గొడవలు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
కోడి పందేల సమయంలో పెద్ద సంఖ్యలో జనం చేరతారు. కొంత మంది మద్యం మత్తులో గొడవలు, దాడులు చేసే అవకాశాలు ఎక్కువ. కాబట్టి కోడి పందేలకు కాస్తంత దూరంగా ఉండటమే మంచిది.
ఈ పందేలకు పిల్లలను కూడా దూరంగా ఉంచడం శ్రేయస్కరం. ఎందుకంటే రక్తపాతం, హింసాత్మక దృశ్యాలు పిల్లల మనసుపై చెడు ప్రభావం చూపుతాయి. అందువల్ల వారిని పందేల వద్దకు తీసుకెళ్లకండి.
పందేల్లో మాటల తూటాలు సాధారణమే. గొడవల్లో జోక్యం చేసుకోకండి.
కోడి పందేల మోజులో పడి ప్రాణాపాయం, చట్టపరమైన చిక్కులు, కుటుంబ సమస్యల వరకూ తెచ్చుకోకండి. జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరిస్తేనే పండుగ ఆనందం ఉంటుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News