వాకింగ్ చేస్తే గుండె సమస్యలను దూరం పెట్టవచ్చా..!
ABN , Publish Date - Nov 15 , 2026 | 05:40 PM
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సులువైన, అత్యంత ప్రభావం చూపే మార్గాల్లో వాకింగ్ చేయడం ఒకటి.. మేం ప్రతీ రోజు వాకింగ్ చేస్తుంటాం.. మాకు గుండె సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడినట్లే.. అది కేవలం అపోహనే అంటున్నారు వైద్యులు.. మరి వాస్తవాలేంటో తెలుసుకుందామా...
ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ ఉన్న వారిలో చాలా మందికి ఉన్న అలవాటు వాకింగ్ చేయడం. రోజూ వాకింగ్ చేయడం వల్ల గుండె సమస్యలకు చెక్ పెట్టొచ్చు అనుకుంటారు. కానీ అది అపోహే అని తాజా పరిశోధనలు తేల్చేశాయి. రోజూ వాకింగ్ చేస్తున్నప్పటికీ.. రోజంతా గంటల తరబడి ఒకే చోట నిశ్చలంగా కూర్చొని ఉండే వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.
ప్రతీ రోజు వాకింగ్ చేయడం వల్ల గుండె సమస్యలకు చెక్ పెట్టొచ్చు అనుకోవడం అపోహే అంటున్నారు వైద్యులు. అలాగని.. వాకింగ్ చేయడం ఆపవద్దు సుమా.. వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. స్థూలకాయాన్ని నివారించవచ్చు. రక్తపోటును నియంత్రించుకోవచ్చు. వాకింగ్ చేసినప్పటికీ.. రోజులో ఎక్కువ సమయం కూర్చొని ఉండడం గుండె మీద హానికర ప్రభావాన్ని చూపిస్తుంది.
మారుతున్న జీవన శైలిలో శారీరక శ్రమ కన్నా.. మేథోపరమైన శ్రమతోనే మనం జీవిస్తున్నాం. గంటల తరబడి డెస్క్ ముందు నిశ్చలంగా కూర్చొని.. పని చేస్తుండడం, కారులో కూర్చొని వెళ్లడం, ఇంటికి వెళ్లాక సోఫాలో కూర్చొని విశ్రాంతి తీసుకోవడం.. ఇలా రోజులో అధిక భాగం కూర్చొనే ఉండడం వల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదెలాగో చూద్దాం..
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలు క్రియారహితంగా మారి బిగుసుకుపోతాయి. కండరాల సంకోచ వ్యాకోచాలే.. రక్తాన్ని గుండె వైపు నెట్టుతాయి. కానీ.. ఈ కండరాలు బిగుసుకుపోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీని వల్ల గుండెపైన, రక్తనాళాల పైన ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా.. ఇది శరీరం కొవ్వులను ప్రాసెసింగ్ చేసే విధానంపై ప్రభావం చూపిస్తుంది. దీని ద్వారా రక్తంలో చెక్కర, కొవ్వుల శాతం పెరుగుతుంది. దీంతో ఊబకాయం, అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు కలుగుతాయి. ఈ వ్యాధుల ప్రభావం గుండె ఆరోగ్యంపై పడి.. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.
కార్పొరేట్ కార్యాలయాల్లో పనిచేసేవారు, ఎక్కువ గంటల పాటు కూర్చొని పనిచేసేవారు.. ఈ కింది సూచనలు పాటించడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
1. అదే పనిగా కూర్చొని పనిచేయకుండా.. ప్రతీ 30 నుంచి 60 నిమిషాలకు ఒకసారి లేచి అటు ఇటు నడవండి.
2. లిఫ్ట్‌కు బదులుగా మెట్లు వినియోగించండి.
3. భోజనం చేసిన వెంటనే.. కూర్చొని పనిచేయకుండా.. కాసేపు నడవండి.
5. సమావేశాల మధ్యలో, డెస్క్‌లో పనిచేస్తున్న సమయాల్లో శరీరాన్ని కాసేపు సాగదీయడం వంటివి చేయండి.
6. పని మధ్యలో చిన్నపాటి నడక విరామాలు తీసుకోండి.
7. వారంలో ఒకరోజు శారీరక శ్రమ గల పనులు చేయండి. ఉదాహరణకు వేగంగా నడవడం, సైక్లింగ్ చేయడం, ఈత, డాన్స్ క్లాస్‌లకు వెళ్లడం.
8. కండరాలను బలపరిచే ఆహారాన్ని తీసుకోండి.
9. ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితంగా తినండి. స్మోకింగ్‌కు దూరంగా ఉండండి.
10. ఒత్తిడిని అదుపులో పెట్టుకోండి.