Share News

ఫ్రిజ్‌ ఓవర్‌లోడ్‌ చేస్తే భారీ నష్టం!

ABN , Publish Date - May 29 , 2026 | 03:22 PM

వేసవిలో ఫ్రిజ్‌ను ఓవర్‌లోడ్‌ చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రిజ్‌ను సరైన విధంగా ఉపయోగించకపోతే దాని కూలింగ్‌ పనితీరుపైనా ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

 ఫ్రిజ్‌ ఓవర్‌లోడ్‌ చేస్తే భారీ నష్టం!
Refrigerator Overloading Risks

ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో ఫ్రిజ్‌ వినియోగం ఎక్కువ అవుతుంది. చల్లటి నీళ్లు, పండ్లు, కూరగాయలు, పెరుగు, మిగిలిన ఆహారం ఇలా అన్నింటినీ ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటాం.. కానీ ఫ్రిజ్‌ను పూర్తిగా నింపేయడం వల్ల ఫ్రిజ్‌ పనితీరుపై ప్రభావం పడటంతో పాటు విద్యుత్‌ బిల్లు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


ఫ్రిజ్‌ను ఎక్కువగా నింపితే ఏమవుతుంది?

చల్లటి గాలి సరిగా ప్రసరించదు

ఫ్రిజ్‌లో చల్లటి గాలి ప్రతి మూలకూ సరిగా చేరడం చాలా ముఖ్యం. కానీ ఫ్రిజ్‌ను వస్తువులతో నిండుగా నింపేస్తే గాలి ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దీంతో పాలు, పెరుగు, వండిన ఆహారం, కట్ చేసిన పండ్లు వంటి పదార్థాలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.

విద్యుత్‌ బిల్లు పెరుగుతుంది

ఫ్రిజ్‌లో ఎక్కువ ఆహార పదార్థాలు ఉంటే వాటిని చల్లగా ఉంచేందుకు కంప్రెసర్‌ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. దీంతో కరెంట్‌ వినియోగం పెరిగి విద్యుత్‌ బిల్లు అధికమవుతుంది.


ఫ్రిజ్‌ కూలింగ్‌ తగ్గిపోవచ్చు

ఎప్పుడూ ఓవర్‌లోడ్‌ చేయడం వల్ల ఫ్రిజ్‌లోని యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా కంప్రెసర్‌పై ప్రభావం పడుతుంది. దీంతో కొంతకాలానికి ఫ్రిజ్‌ కూలింగ్‌ బలహీనపడే అవకాశం ఉంది.

బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం

ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత సరిగా లేకపోతే ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా పాల ఉత్పత్తులు, వండిన కూరలు, కట్ చేసిన పండ్లు త్వరగా పాడవుతాయి. వీటిని తింటే కడుపునొప్పి, గ్యాస్‌, ఫుడ్‌ పాయిజనింగ్‌ సమస్యలు రావచ్చు.

ఫ్రిజ్‌ను సరిగ్గా వాడేందుకు చిట్కాలు

  • ఫ్రిజ్‌లో ఆహార పదార్థాల మధ్య కొంత ఖాళీ ఉంచాలి.

  • వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు.

  • అవసరానికి మించి నీళ్ల బాటిళ్లు నిల్వ చేయకూడదు.

  • ఫ్రిజ్‌ను తరచూ శుభ్రం చేయాలి.

  • అవసరమైన పదార్థాలనే నిల్వ ఉంచాలి.

ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఫ్రిజ్‌ పనితీరు మెరుగుపడటంతో పాటు ఆహార పదార్థాలు కూడా తాజాగా ఉంటాయి.


Also Read:

ఎబోలా వైరస్‌.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

30 ఏళ్లు దాటితే మోకాళ్ల నొప్పి ఎందుకు వస్తోంది?

For More Latest News

Updated Date - May 29 , 2026 | 03:49 PM