ఇంట్లో ఎలుకల బెడదకు చెక్.. చంపకుండానే తరిమికొట్టండిలా!
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:36 AM
ఇంట్లో ఎలుకలు తిరుగుతున్నాయా? వంటగది, అల్మారాల దగ్గర కనిపిస్తూ ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ కథనం మీకోసమే..
ఇంటర్నెట్ డెస్స్: ఇంట్లో ఎలుకలు తిరుగుతున్నాయా? వంటగది, అల్మారాల దగ్గర కనిపిస్తూ ఇబ్బంది పెడుతున్నాయా? విద్యుత్ వైర్లు, దుస్తులను కొరికి నష్టం కలిగిస్తున్నాయా..? కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వాటి బెడదను తగ్గించుకోవచ్చు. ఎలుకలను చంపకుండానే ఇంటికి దూరంగా ఉంచేందుకు ఉపయోగపడే నాలుగు చిట్కాలు ఇవే.
ఆ దారులను మూసేయండి
ఎలుకలను ఇంటి నుంచి తరిమేయడం మాత్రమే కాదు.. అవి లోపలికి వస్తున్న మార్గాలను గుర్తించడమూ ముఖ్యం. గోడల్లోని రంధ్రాలు, పైపుల చుట్టూ ఉన్న ఖాళీలు, తలుపుల కింద ఉండే సందుల ద్వారా ఎలుకలు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇలాంటి మార్గాలను గుర్తించి మూసివేయాలి. దీనివల్ల ఎలుకలు ఇంట్లోకి రావడాన్ని చాలావరకు అడ్డుకోవచ్చు.
పుదీనా నూనెను వాడండి
పుదీనా వాసన ఎలుకలను దూరంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. కొద్దిగా పుదీనా నూనెను దూదిపై వేసి, ఎలుకలు తిరిగే ప్రాంతాలకు సమీపంలో ఉంచవచ్చు. అయితే ఈ పద్ధతి అన్ని సందర్భాల్లోనూ పనిచేస్తుందని చెప్పలేం. ఎలుకల బెడద ఎక్కువగా ఉంటే ఇతర నివారణ చర్యలు కూడా చేపట్టాలి.
వంటగదిని శుభ్రంగా ఉంచండి
ఆహార పదార్థాలు సులభంగా లభించే ప్రాంతాలకు ఎలుకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వంటగదిలో ఆహార పదార్థాలు కింద పడితే వెంటనే శుభ్రం చేయాలి. రాత్రి తిన్న పాత్రలను, మిగిలిపోయిన ఆహారాన్ని అలాగే వదిలేయకూడదు. చెత్తబుట్టకు మూత పెట్టాలి. చెత్తను ప్రతిరోజూ తొలగించడం ద్వారా ఎలుకలకు ఆహారం లభించే అవకాశాన్ని తగ్గించవచ్చు.
ఆహార పదార్థాలను మూత ఉన్న డబ్బాల్లోనే భద్రపరచండి
బియ్యం, పప్పులు, పిండి, బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలు ఎలుకలను ఆకర్షిస్తాయి. అందుకే వీటిని మూత ఉన్న డబ్బాల్లో భద్రపరచాలి. పండ్లు, ఇతర తినుబండారాలనూ ఎలుకలు సులభంగా చేరుకోలేని ప్రదేశాల్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆహార పదార్థాలు కలుషితం కాకుండా చూసుకోవడంతోపాటు ఎలుకల బెడదను తగ్గించుకోవచ్చు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఎలుకలను ఇంటికి దూరంగా ఉంచాలంటే పరిశుభ్రత పాటించడంతోపాటు అవి లోపలికి వచ్చే మార్గాలను మూసివేయడం ముఖ్యం. పుదీనా వంటి ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా ఎలుకల కదలికలను గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది. ఎలుకల మలం లేదా మూత్రంతో కలుషితమైన ప్రాంతాలను శుభ్రం చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి.
ఈ వార్తలూ చదవండి
కరెన్సీ నోట్లు చిరిగిపోయాయా..? ఉచితంగా మార్చుకోండిలా..!
‘స్పై మ్యూజియం’...అన్నీ ఆశ్చర్యాలే!