మళ్లీ మీసం మెలేసిన అంజిరెడ్డి
ABN , Publish Date - Oct 20 , 2026 | 04:43 AM
వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆటలు ఇక సాగవని, ఆయన పుంగనూరు రాకపోవడం మంచిదని టీడీపీ వీరాభిమాని అంజిరెడ్డి అన్నారు
మళ్లీ మీసం మెలేసిన అంజిరెడ్డి
పుంగనూరులో టీడీపీ నామినేషన్లు పడటంతో
ఉత్సాహంగా తొడగొట్టిన ఆ పార్టీ వీరాభిమాని
‘మున్సి’ పోల్‌లో పెద్దిరెడ్డి దౌర్జన్యాలపై
నాడు ఆగ్రహం.. తొడగొట్టి నేతకు సవాల్
పుంగనూరు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆటలు ఇక సాగవని, ఆయన పుంగనూరు రాకపోవడం మంచిదని టీడీపీ వీరాభిమాని అంజిరెడ్డి అన్నారు. తనను 2021లో నామినేషన్ వేయనీయకపోవడంతో... మీసాలు మెలేసి, తొడ గొట్టి పెద్దిరెడ్డిని సవాల్ చేసిన ఘటనతో అంజిరెడ్డి వార్తల్లో నిలిచారు. 2021లో అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం సింగిరిగుంట ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా అంజిరెడ్డి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా, పోలీసుల సహకారంతో వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అయినా, వృద్ధుడైన అంజిరెడ్డి ప్రహరీగోడ దూకి నామినేషన్ వేసేందుకు ఎన్నికల అధికారి వద్దకు పరుగు తీశారు. మధ్యలోనే అడ్డగించి వైసీపీ నేతలు పత్రాలు లాక్కెళ్లి చించేశారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ‘దమ్ము, ధైర్యం ఉంటే మగాడిలా.. ఎన్నికల్లో పోటీచేసి గెలువు..’ అంటూ వైసీపీ నేతలకు, పెద్దిరెడ్డికి సవాల్ విసిరి మీసం మెలేసి, తొడగొట్టారు. దీనిపై చంద్రబాబు, లోకేశ్ ఆయనను పిలిపించి అభినందించారు. ఈసారి పుంగనూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం నామినేషన్ల ముగింపు సందర్భంగా అంజిరెడ్డి మరోసారి మీసం మెలేసి, తొడకొట్టి అందరినీ ఉత్సాహపరిచారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష
నేడు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు