రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలంటే ఉదయాన్నే టీ, కాఫీలు తాగాలా..?
ABN , Publish Date - Nov 07 , 2026 | 08:16 AM
ఉదయం లేవగానే టీ, కాఫీ తాగే అలవాటు మీలో ఎంత మందికి ఉంది. ఎనర్జీ కోసం టీ, కాఫీలపై ఆధారపడే వారు చాలామంది ఉన్నారు. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు టీ, కాఫీలు తీసుకుంటూనే ఉంటారు. టీ, కాఫీలు తాగితేనే శరీరం యాక్టివ్‌గా పనిచేస్తుంది అనుకోవడం భ్రమ. మరి యాక్టివ్‌గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.
ఉదయం లేవగానే కాస్త టీ లేదా కాఫీ తాగితే చాలు.. రోజంతా ప్రశాంతంగా, ఎనర్జిటిక్‌గా ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. లేవగానే టీ, కాఫీ తాగనిదే.. కొంత మందికి రోజు ప్రారంభం కాదు. ఒక్క గంట ఆలస్యం అయితే చాలు.. చిరాకు పడిపోతుంటారు. ఏ పని మీద శ్రద్ధ పెట్టలేరు. ఒక రోజంతా తాగకపోతే.. ఏదో వెలితిగా ఫీల్ అవుతుంటారు. నిజంగానే టీ, కాఫీలు శరీరాన్ని యాక్టివ్‌గా చేస్తాయా అంటే.. దానికి శాస్త్రీయమైన రుజువు లేదు. మరి శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచడానికి ఏం చేయాలి? పదండి తెలుసుకుందాం.
నిద్రలేవగానే కాసేపు ఆరుబయట తిరగాలి
నిద్రలేవగానే కాసేపు ఆరుబయట తిరగాలి. బెడ్‌పైన ఫోన్ చూస్తూ ఉండకుండా.. కాసేపు బయటకు వెళ్లాలి. సహజమైన ఎండ, చల్లని గాలిలో కాసేపు గడపడం ద్వారా మనసు ప్రశాంతంగా మారి మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఈ అలవాటు.. నిద్రను నియంత్రించడంలో దోహదపడుతుంది. రోజూ అదే సమయానికి నిద్రపోవడం, అదే సమయానికి నిద్ర లేవడం అనేది అలవాటుగా మారి స్లీప్ సైకిల్‌ను కంట్రోల్ చేస్తుంది.
శరీరానికి కొంచెం పని చెప్పండి
రాత్రంతా నిద్రపోయి ఉదయం లేవగానే.. కొంత మందిలో ఒళ్లు నొప్పులు సాధారణంగా కనిపిస్తాయి. లేవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. రాత్రంతా కదలకుండా, ఒకే వైపు తిరిగి పడుకోవడం, సరైన భంగిమలో నిద్ర పోకపోవడం ఈ ఒంటినొప్పులకు కారణాలు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఉదయం లేవగానే కాసేపు తేలికపాటి వ్యాయామం చేయాలి. శరీర భాగాల్లో కదలిక రావడం వల్ల రక్త ప్రసరణ.. ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతుంది. శరీరం ఉత్తేజంగా పనిచేస్తుంది.
లేవగానే గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి
నిద్రపోయేటప్పుడు రాత్రి సమయాల్లో శరీరానికి కావాల్సిన ద్రవాలు అందవు. అందుకని నిద్రలేవగానే గ్లాసునీళ్లు తాగినట్లయితే.. డీ హైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. గోరు వెచ్చని నీళ్లు తాగడం కూడా మంచిదే. శరీరానికి కావాల్సిన ద్రవాలు సకాలంలో క్రమం తప్పకుండా అందడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా పనిచేస్తాము.
శ్వాస మీద దృష్టి పెట్టాలి
నిద్రపోయేటప్పుడు.. ఉదయం నిద్రలేవగానే రోజువారీ సమస్యల గురించి ఆలోచిస్తున్నారా.. అయితే చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. పని ఒత్తిడి, సమస్యల గురించి విచారించడం వల్ల మానసికంగా ఆందోళన కలుగుతుంది. అందుకే నిద్ర లేవగానే.. ఆ రోజు డీల్ చేయబోయే సమస్యల గురించి ఆలోచించకుండా.. శ్వాస మీద నియంత్రణ పెంచుకోండి. కొన్ని నిమిషాల పాటు నెమ్మదిగా శ్వాస విడవడం, తీసుకోవడం లాంటివి చేయండి.. మార్పు మీరే గమనిస్తారు.
ఉదయం తినే ఆహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి
కొందరు ఉదయం బ్రష్ చేయగానే.. కాఫీ, టీ తాగుతుంటారు. లేదా తీపి పదార్ధాలు తింటుంటారు. దీని వల్ల కాసేపటికే ఆకలి అవుతుంది. దీంతో మళ్లీ తింటుంటారు. అలా కాకుండా ఉదయం తినే ఆహారంలో ప్రోటీన్ తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి అనిపించదు. రోజంతా యాక్టివ్‌గా పనిచేస్తాం. అందుకని ప్రోటీన్ అధికంగా ఉండే పప్పులు, గుడ్లు, పెరుగు, నట్స్ వంటి ఆహార పదార్థాలను రోజూవారీ ఆహారంలో భాగంగా తీసుకోవాలి.