Share News

ఏసీ, కూలర్ లేకుండానే మీ ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.. అదెలాగంటే..!

ABN , Publish Date - Mar 31 , 2026 | 04:24 PM

ఎండలు దంచికొడుతున్నాయి.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. బయటకు వెళ్తే ఎండల తీవ్రతతో జనాలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వేడి కారణంగా ఏసీ, కూలర్ లేకుంటే ఇంట్లో కూర్చోవడం కష్టంగా మారింది. పగలు అధిక ఉష్ణోగ్రతలు, రాత్రి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలు..

ఏసీ, కూలర్ లేకుండానే మీ ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.. అదెలాగంటే..!

ఎండలు దంచికొడుతున్నాయి.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. బయటకు వెళ్తే ఎండల తీవ్రతతో జనాలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వేడి కారణంగా ఏసీ, కూలర్ లేకుంటే ఇంట్లో కూర్చోవడం కష్టంగా మారింది. పగలు అధిక ఉష్ణోగ్రతలు, రాత్రి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలు.. తమ ఇళ్లల్లో 24 గంటలు ఫ్యాన్‌లు, ఏసీలను ఆన్‌లోనే ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా విద్యుత్ బిల్లు కూడా భారీగా వస్తోంది. అయితే, సమ్మర్‌లో ఏసీ, కూలర్ లేకుండానే మీ ఇంటిని కూల్‌గా ఉంచుకునే ఒక చిట్కా ఉంది. ఈ చిట్కాను పాటిస్తే.. ఇంట్లో ఏసీ, కూలర్ వినియోగం తగ్గి.. విద్యుత్ బిల్లు కూడా తగ్గే అవకాశం ఉంది. మరి ఏసీ, కూలర్ లేకుండా ఇంటిని ఎలా కూల్‌గా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


ఏసీ, కూలర్ లేకుండా ఇంటిని చల్లగా ఎలా ఉంచాలి..?

కిటికీలు, తలుపులు ఎప్పుడు తెరవాలంటే..

చాలా మంది గాలి కోసం రోజంతా ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచుతారు. అయితే, ఇలా చేయడం వల్ల గాలి వీయడం ఏమోగానీ.. బయటి నుంచి వేడి గాలి ఇంటి లోపటికి వస్తుంది. అందుకే.. మీ ఇల్లు చల్లగా ఉండాలంటే.. ఉదయం 8 గంటల లోపు, సాయంత్రం సూర్యాస్తమయం తరువాత మాత్రమే కిటికీలు తెరచి ఉంచాలి. మధ్యాహ్నం సమయంలో కిటికీలు మూసివేసి.. మందపాటి కర్టెన్లు వేయడం ఉత్తమం ఫలితంగా సూర్మరశ్మి నేరుగా ఇంట్లోకి రాకుండా ఉంటుంది. దాంతో ఇంట్లో వేడి కాస్త తగ్గుతుంది.


ఇంట్లో మొక్కలు పెంచడం..

చిన్న చిన్న మొక్కలను ఇంట్లో పెంచుకోవాలి. స్నేక్ ప్లాంట్, అలోవెరా, మనీ ప్లాంట్ వంటి మొక్కలను ఇంట్లో పెంచడం వలన ఆక్సిజన్ శాతం పెరిగి.. వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ మొక్కలు సహజంగా గాలిని శుద్ధి చేసి.. వేడిని గ్రహిస్తాయి. అందుకే మొక్కలను ఇంటి చుట్టూ లేదా ఇంటి లోపల పెంచుకోవాలి. తద్వారా ఇంట్లో వేడి తగ్గుతుంది.


విద్యుత్ పరికరాల వాడకాన్ని తగ్గించడం..

ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా అధిక ఉష్ణోగ్రతలకు కారణం అవుతాయి. అందుకే.. మధ్యాహ్నం సమయంలో లైట్లు, టీవీలు, కంప్యూటర్లు ఆపేయాలి. ముఖ్యంగా పాత బల్బులకు బదులుగా ఎల్ఈడీ బల్బులను వాడాలి. అలాగే వంట చేయడం వల్ల వచ్చే వేడి గాలి బయటకు వెళ్లేలా వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఏర్పాటు చేయాలి. వంట చేసినంత సేపూ అది ఆన్‌లో ఉంటే.. వేడి అంతా బయటకు వెళుతుంది.


ఇంటి పైకప్పునకు కూలింగ్ పెయింట్..

ప్రస్తుత టెక్ యుగంలో అనేక రకాల పెయింట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇంటిని కూల్‌గా ఉంచేందుకు సహకరించే కూలింగ్ పెయింట్స్‌ కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంటి పైకప్పునకు ఈ పెయింట్ వేయడం వలన ఎండ వేడిమి నుంచి రక్షణ ఉంటుంది. ఈ పెయింట్ సూర్యకిరణాలను పరావర్తనం చెందిస్తాయి. ఫలితంగా గదిలోపల చల్లగా ఉంటుంది. దీనివల్ల ఫ్యాన్లు, ఎయిర్ కూలర్స్‌పై ఆధారపడటం తగ్గుతుంది.


లేత రంగు కర్టెన్లు..

ఇంట్లో లేత రంగు కర్టెన్లను మాత్రమే వాడండి. ముదురు రంగు కర్టెన్లు.. వేడిని త్వరగా గ్రహిస్తాయి. ఫలితంగా ఇంట్లో త్వరగా వేడి పెరుగుతుంది. అందుకే.. కిటికీలు, తలుపులకు లేత రంగు కర్టెన్లను ఏర్పాటు చేయాలి. ఈ రంగు కర్టెన్లు.. సూర్యకాంతిని తక్కువ గ్రహిస్తాయి. ఫలితంగా ఇంట్లో తక్కువ వేడి ఉంటుంది.

గమనిక: వేసవికాలం దృష్ట్యా ప్రజల ప్రయోజనార్థం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఇక్కడ అందించడం జరుగుతుంది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.


Also Read:

ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్

సిగ్నేచర్ సెలబ్రేషన్స్.. నిషేధం మాత్రం పడకుండా చూసుకుంటా: ఎల్ఎస్‌జీ ప్లేయర్ దిగ్వేశ్

ఉక్రెయిన్‌‌ను సాయం కోరిన గల్ఫ్ దేశాలు! ఇరాన్‌కు చెక్ పెట్టే డీల్!

Updated Date - Mar 31 , 2026 | 04:28 PM