ఉక్రెయిన్‌ను సాయం కోరిన గల్ఫ్ దేశాలు! ఇరాన్‌కు చెక్ పెట్టే డీల్!
ABN , Publish Date - Mar 31 , 2026 | 03:51 PM
ఇరాన్ ప్రయోగిస్తున్న షాహిద్ డ్రోన్స్‌ను అడ్డుకునే ఇంటర్‌సెప్టర్‌ల కోసం గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: షాహిద్ డ్రోన్స్‌తో విరుచుకుపడుతున్న ఇరాన్ తన ప్రత్యర్థులకు ఊహించని స్థాయిలో నష్టం కలిగిస్తోంది. ఈ డ్రోన్‌లను అడ్డుకునేందుకు ఖరీదైన ఇంటర్‌సెప్టర్ మిసైల్స్‌ను వాడుతూ అమెరికా, గల్ఫ్ దేశాలు ఆర్థికంగా భారీ స్థాయిలో నష్టపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు తాజాగా గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్ సాయాన్ని అర్థించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. షాహిద్ డ్రోన్స్‌ను మార్గమధ్యంలోనే ధ్వంసం చేయగలిగిన స్టింగ్ ఇంటర్‌సెప్టర్‌ల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో గతవారం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని సమాచారం.
ఒక్కో షాహిద్ డ్రోన్ ఉత్పత్తికి గరిష్ఠంగా 30 వేల డాలర్లు (రూ.28 లక్షలు) మాత్రమే ఖర్చు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో, ఇరాన్ నెల రోజుల వ్యవధిలోనే వేల సంఖ్యలో షాహిద్ డ్రోన్స్‌ను, ఇతర మిసైల్స్‌ను రంగంలోకి దించింది. వీటిని అడ్డుకునేందుకు అమెరికా, గల్ఫ్ దేశాలు ఖరీదైన పాట్రియట్ మిసైల్స్, థాడ్ గగనతల రక్షణ వ్యవస్థలను రంగంలోకి దించాయి. భారీ సంఖ్యలో షాహిద్ డ్రోన్స్ వచ్చిపడుతుండటంతో ఈ వ్యవస్థలు వాటన్నిటినీ అడ్డుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మిసైల్ నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయి. ఉత్పత్తి భారంగా మారింది.
వాస్తవానికి రష్యాతో యుద్ధం తొలి నాళ్లల్లో ఉక్రెయిన్ కూడా దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొందని పరిశీలకులు చెబుతున్నారు. అప్పట్లో ఇరాన్ సరఫరా చేసిన షాహిద్ డ్రోన్స్‌తో ఉక్రెయిన్ దళాలపై రష్యా కూడా ఇదే రీతిన విరుచుకుపడింది. ఉక్రెయిన్‌కు ఐరోపా దేశాలు, అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు కూడా ఆశించిన మేర అప్పట్లో అందలేదు. ఈ క్రమంలో ఉక్రెయిన్ స్వయంగా రంగంలోకి దిగి షాహిద్ డ్రోన్స్‌ను సమర్థవంతంగా అడ్డుకునే స్టింగ్, బుల్లెట్ ఇంటర్‌సెప్టర్‌లను రూపొందించిందట. షాహిద్ కంటే తక్కువ ధరకు, మరింత వేగంగా ఉత్పత్తి చేసేలా వీటిని డిజైన్ చేసింది. షాహిద్ డ్రోన్స్‌ను కూల్చడంలో ఇవి విజయం సాధించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఫలితంగా 2025 నుంచి ఉక్రెయిన్ రష్యాకు కొంత మేర బ్రేకులు వేయగలిగింది. రష్యా వేల సంఖ్యలో ప్రయోగించిన షాహిద్ డ్రోన్స్‌ను విజయవంతంగా కూల్చివేసింది.
ఉక్రెయిన్ రూపొందించిన స్టింగ్ ఇంటర్‌సెప్టర్ గంటకు గరిష్ఠంగా 340 కిలోమీటర్ల వేగంతో 10 వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తూ లక్ష్యాన్ని ఛేదించగలదని నిపుణులు చెబుతున్నారు. థర్మల్ ఇమేజింగ్ కెమెరాల సాయంతో ఇది టార్గెట్‌ను గుర్తించి ధ్వంసం చేస్తుంది. ఇక బులెట్ ఇంటర్‌సెప్టర్ ఏఐ సాయంతో లక్ష్యాన్ని గుర్తించి ధ్వంసం చేయగలదని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు పీ1- సన్, ఆక్టోపస్ 100, ఓడిన్ విన్‌హిట్ వంటి ఇంటర్‌సెప్టర్‌లను కూడా ఉక్రెయిన్ సిద్ధం చేసుకుందట. ఈ నేపథ్యంలో స్టింగ్ ఇంటర్‌సెప్టర్‌లను తమకూ సరఫరా చేయాలని ఖతర్, యూఏఈ, సౌదీ అరేబియాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇందుకు ప్రతిగా రష్యాను అడ్డుకునే అత్యాధుని మిసైల్ వ్యవస్థలను ఉక్రెయిన్ కోరినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి ఈ స్థితి వస్తుందని ఇజ్రాయెల్, అమెరికాల కంటే ముందే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గుర్తించారు. యుద్ధం మొదట్లోనే హెచ్చరికలు చేశారు. ‘షాహిద్ డ్రోన్స్‌ను తాము కొన్నేళ్లుగా విజయవంతంగా అడ్డుకుంటున్నాము. ఈ తరహా అనుభవం ప్రపంచంలో మాకు తప్ప మరెవరికీ లేదు. ఈ విషయాన్ని ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి. మా సాయం కావాలంటే వెంటనే చేస్తాం’ అని ఇరాన్ యుద్ధం మొదట్లోనే జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అయితే, చిట్టచివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే జెలెన్‌స్కీ సాయాన్నికోరతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో అన్నారు. కానీ జెలెన్‌స్కీ ఊహించినట్టుగా నెల రోజుల వ్యవధిలోనే పరిస్థితులు తారుమారు అయ్యాయని పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి:
డీల్ త్వరగా కుదరకపోతే విధ్వంసమే! ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు
డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్.. ఇరాన్‌లోని యురేనియమే టార్గెట్..