డీల్ త్వరగా కుదరకపోతే విధ్వంసమే! ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు
ABN , Publish Date - Mar 30 , 2026 | 08:23 PM
తమతో ఇరాన్ త్వరగా డీల్ కుదుర్చుకోకపోతే విధ్వంసం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. ఇరాన్‌తో చర్చల్లో పురోగతి కూడా ఉందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తమతో ఇరాన్ త్వరగా డీల్ కుదుర్చుకోకపోతే అక్కడి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌లను, ఖర్గ్ ద్వీపాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు. చర్చల్లో కొంత పురోగతి ఉన్నప్పటికీ త్వరగా ఒప్పందం కుదరాలని తేల్చి చెప్పారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ హెచ్చరిక చేశారు. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ వెంటనే తెరవకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
‘ఇరాన్ కొత్త పాలకులతో అమెరికా చర్చలు జరుపుతోంది. ఇరాన్‌లో మిలిటరీ ఆపరేషన్ ముగింపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పటికే చాలా పురోగతి కనిపించింది. అయితే, ఏదైనా కారణంగా త్వరగా డీల్ కుదరకపోతే, హోర్ముజ్‌ను ఇరాన్ తక్షణం తెరవకపోతే అక్కడి విద్యుత్ కేంద్రాలు, చమురు కేంద్రాలు అన్నిటినీ పేల్చేసి మరీ గుడ్ బై చెబుతాము. ఖర్గ్ ద్వీపాన్ని కూడా నామరూపాలు లేకుండా చేస్తాము. ఇప్పటివరకూ మేము సంయమనం పాటిస్తూ వాటి జోలికి వెళ్లలేదు’ అని ట్రంప్ పోస్టు పెట్టారు. అమెరికా సైనికులు, ఇతరులను ఇబ్బంది పెట్టిన ఇరాన్ మునుపటి పాలకులపై ప్రతీకారంగా ఇదంతా చేస్తామని అన్నారు.
యూఎస్‌తో ఎలాంటి చర్చలు జరపట్లేదని ఇరాన్ తాజాగా మరోసారి స్పష్టం చేసింది. కానీ, పాక్ ద్వారా సందేశాల్ని ఇరాన్ పంపించినట్టు అక్కడి ప్రభుత్వ మీడియాలో ఓ కథనం వెలువడింది. అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్లాన్‌కు ప్రతిస్పందనగా ఇరాన్ తమ సందేశాన్ని పంపించిందని పేర్కొంది. ‘యూఎస్‌తో నేరుగా ఎలాంటి చర్చలు లేవు. మధ్యవర్తుల ద్వారా ఆచరణ సాధ్యం కాని డిమాండ్స్ మాత్రమే మాకు వస్తున్నాయి. పాక్ వేదికలతో మాకేమీ సంబంధం లేదు. మేము ఆ చర్చల్లో పాల్గొనలేదు. యుద్ధం ముగించాలని ఇరుగుపోరుగు దేశాలు పిలుపునివ్వడాన్ని స్వాగతిస్తున్నాము. కానీ యుద్ధాన్ని అసలు ప్రారంభించింది ఎవరో మర్చిపోకూడదు’ అని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక సోమవారం కూడా అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడులు కొనసాగించాయి. ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. కువైట్‌లోని నీటి, విద్యుత్ ప్లాంట్‌పై దాడి చేసింది.
ఈ వార్తలూ చదవండి:
డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్.. ఇరాన్‌లోని యురేనియమే టార్గెట్..
ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది: డొనాల్డ్ ట్రంప్