Share News

పాత అలవాటుకే కొత్తది జతచేద్దాం!

ABN , Publish Date - May 24 , 2026 | 08:53 AM

ప్రతీ ఒక్కరికీ కొన్ని అలవాట్లు, అభిరుచులుంటాయి. శరీరం, మనసు వాటికి అలవాటు పడిపోతుంది. రొటీన్‌గా చేసుకుంటూ పోతుంటారు.

పాత అలవాటుకే కొత్తది జతచేద్దాం!
Lifestyle

ప్రతీ ఒక్కరికీ కొన్ని అలవాట్లు, అభిరుచులుంటాయి. శరీరం, మనసు వాటికి అలవాటు పడిపోతుంది. రొటీన్‌గా చేసుకుంటూ పోతుంటారు. అదే ఒక కొత్త అలవాటును అలవర్చుకోవాలంటే అనుకున్నంత వీజీయేం కాదు. ఆరంభశూరత్వం ఉంటుంది కానీ అలవాటుగా మాత్రం మారదు. అలాంటప్పుడు ‘పాత అలవాటుకే కొత్తది జత చేయండి’ అంటున్నారు లైఫ్‌స్టయిల్‌ పండితులు. అదే ‘హ్యాబిట్‌ స్టాకింగ్‌’. ఆ జీవన సూత్రాలే ఇవి...

‘ఉదయం కాఫీ తాగాక, 50 సెకన్లు ధ్యానం చేస్తా... ఆ తరవాత, ఆరోజు చేయాల్సిన ముఖ్యమైన పనుల్ని డైరీలో రాసుకుంటా’, ‘ఆఫీసు పని ఇప్పుడే అయిపోయింది... అందుకే గదిలో ఐదు నిమిషాలు అటూ ఇటూ నడుస్తున్నా’, ‘ స్టౌ మీద టీ మరిగేంతలో... పది పుషప్‌లు చేస్తా’... ఇన్‌స్టా నిండా ఇలాంటి ‘హ్యాబిట్‌ స్టాకింగ్‌’ స్టోరీలే.


ఉదయం నిద్రలేవడం... బ్రష్‌ చేసుకోవడం, కాఫీ తాగడం, స్నానం చేయడం, డ్రెస్‌ చేసుకోవడం, టిఫిన్‌ చేయడం... ఇదే చాలా మంది రొటీన్‌. మరో ఆలోచన లేకుండా యాంత్రికంగా శరీరం ఈ పనులన్నింటినీ క్రమం తప్పకుండా... ఒకదాని తరవాత ఒకటిగా చేసేస్తుంది. గత కొన్నేళ్లుగా ఈ విధంగా చేయడం వల్ల అలవాటైపోయింది. అయితే ప్రతీ ఒక్కరిలో నచ్చని అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని మార్చుకోవాలంటే మాత్రం చాలా కష్టం. అలాగే రొటీన్‌కి భిన్నంగా మధ్యలో ఏ పని వచ్చినా తడబడటం ఖాయం. కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మెదడుకు అలవాటు లేకపోవడం. శిశువులతో పోలిస్తే వయోజనుల్లో 41 శాతం తక్కువ న్యూరాన్స్‌ (మెదడు కణాలు) ఉంటాయట.


book3.2.jpgకాబట్టి ఏదైనా అలవాటును, అభిరుచిని మార్చుకోవాలన్నా, కొత్తగా అలవర్చుకోవాలన్నా అనుకున్నంత సులభం కాదు. అందుకే అప్పటికే ఉన్న అలవాటుతో పాటు కొత్త అలవాటును కలిపి ప్రయత్నించి చూడమంటున్నారు మానసిక నిపుణులు. దీనినే ‘హ్యాబిట్‌ స్టాకింగ్‌’ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే... మెదడులో మొదటి అలవాటుకు సంబంధించిన ‘వైరింగ్‌’ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి రెండో పనినీ అందులో భాగంగా భావిస్తూ ముందుకు తీసుకువెళుతుంది. కానీ తికమకపడదు.


రెండు నిమిషాలు చాలు...

రోజంతా ఇల్లు, ఆఫీసు పనులతో క్షణం కూడా ఖాళీ లేకుండా ఉన్న ఈ గజి‘బిజీ’ జీవితంలో కొత్త అలవాటును అలవాటు చేసుకోవడం అంత సులభం కాదనే అనిపిస్తుంది. అయితే సరికొత్త అలవాట్లు, అభిరుచుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన పని లేదు. కాస్త టెక్నిక్‌ను వాడితే సరిపోతుంది. ఉదయం నిద్ర లేవగానే, రెండు నిమిషాలు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు చేయడం... కాఫీ తాగుతూ మొబైల్‌లో బ్యాంక్‌ అకౌంట్‌లు చూసుకోవడం... రాత్రి బ్రష్‌ చేసుకున్న తరవాత రెండు నిమిషాలు ఆరోజులో జరిగినవన్నీ ఓ జర్నల్‌గా రాసుకోవడం... ఇలా చిన్న పనులను రోజువారీ పనులతో కలిపి కంటిన్యూగా చేసుకుంటూపోతే... అవే క్రమంగా అలవాట్లుగా మారతాయి. ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మంచి అలవాట్లను చేసుకోవడం వల్ల జీవనశైలిలో గుర్తించదగ్గ మార్పులు వస్తాయి. అంతేకాకుండా మెదడులో చురుకుదనం, పునర్వ్యవస్థీకరించుకునే సామర్థ్యం పెరుగుతుంది. దీన్నే శాస్త్ర పరిభాషలో ‘సెల్ఫ్‌ డైరెక్టెడ్‌ న్యూరోప్లాస్టీ’ అంటారు.


book3.3.jpgఅంత కష్టమేం కాదు...

కొత్త ఏడాది ప్రారంభంలో దాదాపు 70 శాతం మంది వివిధ రకాల లక్ష్యాలను ఏర్పరచుకుంటారట. కానీ అందులో పావు శాతం మంది మాత్రమే వాటిని ఆచరణలో పెడతారనేది వాస్తవం. ‘విద్యార్థి దశలో అయితే కొత్త అలవాట్లను ఇట్టే చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఉరుకులు పరుగుల జీవనంలో కొత్త అలవాట్లను అలవర్చుకోవడానికి అంత సమయం ఎక్కడ ఉంద’నే వాళ్లే చాలామంది. అయితే ‘అలవాట్లను జతచేసుకోవడానికి’ వయసుతో సంబంధం లేదు. అలాగే దీనికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. పైగా అదేమంత కష్టమూ కాదని పేర్కొంటూ... కొన్ని సూచనలు చేస్తున్నారు సైకాలజిస్టులు. అవేమిటంటే...


  • ప్రస్తుత అలవాట్ల లిస్టు తయారుచేయండి: రోజూ ఏం చేస్తున్నారు? పళ్లు తోముకోవడం, కాఫీ తాగడం, స్నానం చేయడం... వీటన్నింటికీ కొత్త అలవాట్లను జతచేసుకోవచ్చు. మీకు చేయాలని ఉన్నా, సమయాభావంతోనో మరో కారణం వల్లనో కుదరకపోయిన పనులను ఒక దగ్గర రాసుకోండి. అలాగే రోజూ కాకపోయినా వారంలో ఓసారి చేసే పనులు... ఉదాహరణకు కూరగాయల మార్కెట్‌కు వెళ్లడం, స్నేహితులతో భోజనం చేయడం లాంటివి కూడా రాయాలి.

  • కొత్త అలవాట్లనూ రాసుకోండి: ‘నిద్రలేవగానే బెడ్‌ సర్దుకోవాలి’, ‘కృతజ్ఞతలు తెలియజేయాలి’, ‘వాకింగ్‌కి వెళ్లాలి’, ‘కొత్త నవల పూర్తిచేయాలి.... ఇలా లిస్టు రాసుకోవాలి. పెద్ద పనులకు ఎక్కువ సమయం అని కాకుండా, ఏ పని అయినా రోజూ కాస్త కాస్త చేస్తే పూర్తవుతుందనే విషయాన్ని మరచిపోరాదు.


book3.5.jpg

  • విజయవంతం అయితే...: ప్రస్తుత అలవాటుకు కొత్తదాన్ని కలుపుకోవాలి. అలా చేయడం వల్ల... ఆ రెండు పనులు సక్రమంగా సాగుతుంటే, మరికొన్ని కొత్త అలవాట్లను జతచేసుకోవడం మంచిది.

  • అస్సలు కుదరకపోతే... : చాలామంది కొత్త పనులను ఉత్సాహంగా మొదలెడతారు. కానీ కొనసాగించలేకపోతారు. అందుకే అవి అలవాట్లుగా మారవు. ఇలాంటివారు ‘ప్రెమాక్‌’ నియమం పాటిస్తే సరి. అలవర్చుకున్న ప్రతీ కొత్త అలవాటుకూ బహుమతిగా రివార్డులు ఇచ్చుకోవడం. బహుమతుల కోసమైనా హుషారుగా కొత్త అలవాట్లను అలవర్చుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.


అయితే ఈ లైఫ్‌స్టయిల్‌ సూత్రాన్ని అలవర్చుకోవాలంటే... తొలుత ఏదో ఒకట్రెండు కొత్త అలవాట్లతో ప్రారంభించడం మంచిది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొత్త అలవాట్లను అలవర్చుకోవడం వల్ల మొదటికే మోసం రావొచ్చు. కాబట్టి చిన్నగా మొదలుపెట్టి పెద్ద విజయాలను సాధించడం శ్రేయస్కరం. ఇది స్వీయ అభివృద్ధికి సంబంధించి ఓ సహజ ప్రక్రియ. అంతేకానీ ఓ ఛాలెంజ్‌గా మాత్రం ఎట్టిపరిస్థితుల్లో భావించొద్దు. ఒక అలవాటుకు మరో అలవాటును జత చేయడం వల్ల (‘హ్యాబిట్‌ స్టాకింగ్‌’) ఆనందాన్ని, విజయాల్ని సాధించినవారు ఎంతోమంది ఉన్నారు. వారి అనుభవసారం నుంచి వచ్చిన ఇలాంటి సరికొత్త టెక్నిక్‌లు పాటిస్తే... తప్పకుండా మార్పును చూడొచ్చు... ఆస్వాదించొచ్చు.


book3.7.jpgఇదో దారి

‘హ్యాబిట్‌ స్టాకింగ్‌’ అనే జంట పదాల్ని మొదటగా ఉపయోగించింది ఎస్‌.జె. స్కాట్‌. ఆయన 2014లో రచించిన ‘హ్యాబిట్‌ స్టాకింగ్‌: 97 స్మాల్‌ లైఫ్‌ ఛేంజెస్‌ దట్‌ టేక్‌ ఫైవ్‌ మినట్స్‌ ఆర్‌ లెస్‌’ అనే పుస్తకంలో కొత్త అలవాట్లు అలవర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి స్పష్టంగా రాశారు. ‘చేయాలనుకున్న పనిని చేయడానికి ఇదో దారి’ అని స్కాట్‌ హ్యాబిట్‌ స్టాకింగ్‌ను వివరించారు. అయితే ‘హ్యాబిట్‌ స్టాకింగ్‌’ బాగా పాపులర్‌ అయ్యేలా చేసింది మాత్రం జేమ్స్‌ క్లియర్‌. ‘అటామిక్‌ హ్యాబిట్స్‌: యాన్‌ ఈజీ అండ్‌ ప్రూవెన్‌ వే టూ బిల్డ్‌ గుడ్‌ హ్యాబిట్స్‌ అండ్‌ బ్రేక్‌ బ్యాడ్‌ వన్స్‌’ లో అలవాట్లను జతచేసుకోవడం వల్ల కలిగే లాభాలను స్పష్టంగా వివరించారు. ఈ పుస్తకం మిలియన్‌ కాపీలు అమ్ముడై ఆల్‌టైం బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది.


ఇలా మొదలెడదాం...

  • ఉదయం నిద్ర లేవగానే, ఐదు నిమిషాలు స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజులు చేయాలి.

  • రాత్రి భోజనాలప్పుడు... మీ రోజు ఎలా గడిచిందని కుటుంబసభ్యులను అడగాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ బంధాలు బలోపేతమవుతాయి.

  • కారు సీట్లో కూర్చోగానే, ఇంజిన్‌ స్టార్ట్‌ చేయడానికి ముందు ఐదు నిమిషాలు డీప్‌ బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు చేయాలి.

  • వంట చేస్తూ, ఇష్టమైన సంగీతాన్ని వినడం లేదా నృత్యం చేయడం మంచిది.

  • టీవీ చూడడానికి ముందు ఐదు నిమిషాలు నడిచి సోఫాలో కూర్చోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

దారుణం.. మహిళను కొరికి చంపిన పెంపుడు కుక్కలు..

వడదెబ్బతో ఒక్కరోజే 40 మంది మృతి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 24 , 2026 | 08:53 AM