మెంతి ఆకులతో కసూరి మేతి.. ఎంత సులభమో తెలుసా?
ABN , Publish Date - Feb 21 , 2026 | 01:47 PM
కసూరి మేతి వంటలకు ప్రత్యేకమైన రుచి, సువాసన ఇచ్చే అద్భుతమైన సుగంధ ద్రవ్యం. తాజా మెంతి ఆకులతో ఇంట్లోనే సులభంగా కసూరి మేతి తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మెంతి ఆకులు (మెంతికూర) విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉన్న అద్భుతమైన ఆకుకూర. పప్పు, పరోటా, కూరలు వంటి వంటకాలలో మెంతి ఆకులని ఉపయోగిస్తారు. ఈ మెంతి ఆకులతో ఇంట్లోనే కసూరి మేతి తయారు చేసుకుంటే వంటలకు మంచి రుచి, సువాసన వస్తుంది. దుకాణంలో కొనకుండా, స్వచ్ఛమైన, కల్తీ లేని కసూరి మేతిని మనమే తయారు చేసుకోవచ్చు.
ఎండిన మెంతి ఆకులనే కసూరి మేతి అంటారు. ఇవి వంట రుచి పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఇనుము, కాల్షియం, విటమిన్ A, విటమిన్ C వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపరచడం, మధుమేహం నియంత్రణ, బరువు తగ్గడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడడం వంటి ప్రయోజనాలు కలిగిస్తాయి. ఇంట్లోనే సులభంగా కసూరి మేతిని ఎలా తయారీ చేయాలో ఇప్పుడు చూద్దాం..
మెంతి ఆకులతో కసూరి మేతి
ముందుగా మార్కెట్‌లో తాజా, ఆకుపచ్చ మెంతి ఆకులు తీసుకోండి. తరువాత వాటిని ఇంట్లో 2–3 సార్లు శుభ్రమైన నీటితో బాగా కడగండి.
కడిగిన ఆకుల్లో నీరు లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత మైక్రోవేవ్ ట్రేలో సమంగా పరచాలి. ట్రేను మైక్రోవేవ్‌లో పెట్టి సుమారు 3 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత బయటకు తీసి ఆకులను తిప్పి మళ్లీ వేడి చేయాలి. ఇలా 2–3 సార్లు చేయాలి.
ఆకులు పూర్తిగా ఎండిన తర్వాత వాటిని చల్లారనివ్వాలి. ఆపై చేతులతో నలిపి పొడి మాదిరిగా చేయాలి. ఇలా కసూరి మేతి తయారవుతుంది. దీనిని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేస్తే ఎక్కువ కాలం సువాసన అలాగే ఉంటుంది.
మైక్రోవేవ్ లేకుండా చేసే విధానం
మైక్రోవేవ్ లేకపోయినా కసూరి మేతి తయారు చేయవచ్చు. కడిగిన మెంతి ఆకులను ఫ్యాన్ గాలి వద్ద ఆరబెట్టాలి. తర్వాత ఎండలో పెట్టి పూర్తిగా క్రిస్పీగా మారే వరకు ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన తర్వాత చేతులతో నలిపి పొడిగా చేసి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. ఇలా ఇంట్లోనే సులభంగా కసూరి మేతి తయారు చేసుకోవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?
పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
For More Latest News