Share News

కల్తీ చిలగడదుంపలను ఇలా గుర్తించండి

ABN , Publish Date - Mar 20 , 2026 | 03:47 PM

మార్కెట్‌లో ఆకర్షణీయంగా కనిపించే చిలగడదుంపల విషయంలో జాగ్రత్త అవసరం. వాటిని మరింత ఎర్రగా చూపించేందుకు హానికరమైన కృత్రిమ రంగులు ఉపయోగిస్తున్నట్లు ఆహార భద్రత సంస్థ (FSSAI) హెచ్చరిస్తోంది.

కల్తీ చిలగడదుంపలను ఇలా గుర్తించండి
Fake Sweet Potatoes Identification

ఇంటర్నెట్ డెస్క్: చిలగడదుంప (Sweet Potato) విటమిన్లు (A, C, B6), ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లతో కూడిన సూపర్ ఫుడ్. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, కంటి ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే బీటా-కెరోటిన్ శరీరానికి అవసరమైన విటమిన్ A ను అందిస్తుంది.


అయితే, మార్కెట్‌లో దొరికే చిలగడదుంపల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. బయటకు తాజాగా, ఆకర్షణీయంగా కనిపించినా, కొన్ని సందర్భాల్లో వాటిలో కల్తీ ఉండే అవకాశం ఉందని ఆహార భద్రత అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిలగడదుంపలను ఎర్రగా చూపించడానికి హానికరమైన రసాయన రంగులు ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. ఆహార భద్రత సంస్థ (FSSAI) ప్రకారం, మార్కెట్‌లో మంచిగా కనిపించేందుకు చిలగడదుంపలపై ‘రోడమైన్ బి’ వంటి ప్రమాదకర రంగులు పూస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


కల్తీ చిలగడదుంపలను ఎలా గుర్తించాలి?

ఒక దూది (కాటన్) ముక్క తీసుకుని, దాన్ని నీటిలో లేదా కూరగాయల నూనెలో తడిపి, చిలగడదుంపపై నెమ్మదిగా రుద్దాలి. దూది రంగు మారకపోతే.. అది సహజమైన, అసలైన చిలగడదుంప అని అర్థం. దూది ఎరుపు లేదా ఊదా రంగులోకి మారితే దానిపై కృత్రిమ రంగు పూసి ఉండే అవకాశం ఉంది.

ఆరోగ్యంపై ప్రభావం

కల్తీ చేసిన చిలగడదుంపలలో ‘రోడమైన్ బి’ వంటి విషపూరిత రసాయనాలు ఉండవచ్చు. ఇవి శరీరానికి చాలా ప్రమాదకరం. కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపుతాయి. కడుపులో మంట, వాంతులు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల, చిలగడదుంపలు కొనేటప్పుడు కేవలం రంగును చూసి మోసపోకుండా జాగ్రత్త వహించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Mar 20 , 2026 | 04:57 PM