Share News

బెల్లం తింటున్నారా? కల్తీని ఇలా గుర్తించండి..!

ABN , Publish Date - Mar 03 , 2026 | 02:12 PM

మార్కెట్లో పాలు, పండ్లతో పాటు బెల్లం కూడా కల్తీ అవుతోంది. ఇలాంటి సమయంలో మీరు కొన్ని సాధారణ చిట్కాలు ఉపయోగించి బెల్లం కల్తీని కనిపెట్టడం చాలా ముఖ్యం.

బెల్లం తింటున్నారా? కల్తీని ఇలా గుర్తించండి..!
Identify Adulterated Jaggery

ఇంటర్నెట్ డెస్క్: పండుగల సందర్భాలలో వంటలు, మిఠాయిల తయారీకి బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ, మార్కెట్లో జరుగుతున్న నకిలీ మోసాల కారణంగా బెల్లం కూడా కల్తీ అవుతోంది. ఇలాంటి సమయంలో మీరు కొన్ని సాధారణ చిట్కాలు ఉపయోగించి బెల్లం కల్తీని కనిపెట్టడం చాలా ముఖ్యం. మీరు తింటున్న బెల్లం కల్తీదో కాదో ఇంట్లోనే సులభంగా ఇలా గుర్తించండి..


వాసన ద్వారా గుర్తింపు

సహజ బెల్లానికి ప్రత్యేకమైన తీపి వాసన ఉంటుంది. దాన్ని పగలగొట్టినప్పుడు మృదువైన చెరకు సువాసన వస్తుంది. కానీ కల్తీ బెల్లం ఉంటే రసాయన వాసన, అసహజమైన గంధం లేదా చక్కెర వాసన అనిపిస్తుంది. వాసన ఆధారంగా అనుమానం ఉంటే, ఆ బెల్లాన్ని కొనవద్దు.

నీటి పరీక్ష

చిన్న ముక్క బెల్లాన్ని గోరువెచ్చని నీటిలో వేసి చూడండి. నిజమైన బెల్లం నెమ్మదిగా కరిగి నీటిని స్పష్టంగా ఉంచుతుంది. కానీ కల్తీ బెల్లం ఉంటే నీరు మురికి, మట్టి లాంటి పొర, తెల్లటి పిండి వంటి పదార్థాలు కనిపిస్తాయి.

రుచి ద్వారా గుర్తింపు

నిజమైన బెల్లం మృదువైన తీపి రుచి ఇస్తుంది. కల్తీ బెల్లం ఎక్కువగా తీపి అనిపించటం, గొంతులో మంట లేదా చేదు రుచి అనిపించటం సాధారణం. తిన్న తర్వాత నోటిలో అసహజ అనుభూతి ఉంటే, అది సహజ బెల్లం కాదని భావించాలి.


మెత్తదనం పరీక్ష

నిజమైన బెల్లం సులభంగా విరుగుతుంది, మృదువుగా ఉంటుంది. కానీ కల్తీ బెల్లం గట్టిగా, జిగటగా ఉంటుంది.. దానిని ఉపయోగించవద్దు.

FSSAI ఒక సింపుల్ పరీక్ష ద్వారా బెల్లం కల్తీదో కాదో తెలుసుకునే విధానాన్ని చూపించింది. టెస్ట్ ట్యూబ్ లేదా చిన్న గ్లాసులో 1/4 టీస్పూన్ చూర్ణ బెల్లం తీసుకోవాలి. అందులో 3 మి.లీ. హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCL) వేసి గమనించండి. బుడగలు ఏర్పడకపోతే బెల్లం స్వచ్ఛమైనదని అర్థం..బుడగలు ఏర్పడితే బెల్లం కల్తీ అయిందని గుర్తించాలి.


జాగ్రత్తలు

  • ప్యాక్ చేసిన బెల్లం కొనేటప్పుడు FSSAI లైసెన్స్ నంబర్ తనిఖీ చేయాలి.

  • ప్రకాశవంతమైన, మెరిసే బెల్లం తీసుకోకండి. అవి కల్తీ అయి ఉండవచ్చు.

  • నమ్మకమైన బ్రాండ్ లేదా విక్రేతల వద్ద కొనాలి.

  • తక్కువ ప్రాసెస్ చేసిన ముదురు బెల్లం ఎంచుకోవాలి.

  • అసాధారణంగా చౌకైన బెల్లం తీసుకోకండి.

కల్తీ బెల్లం చూసినపుడు FSSAI ఆన్‌లైన్ ఫిర్యాదు పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా కంప్లైట్ చేయండి. లేదా స్థానిక ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయండి.

Updated Date - Mar 03 , 2026 | 02:55 PM