అటుకుల ఉప్మాతో ఆరోగ్యం.. ఎలా తయారు చేస్తారో తెలుసా?
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:13 PM
అటుకుల ఉప్మా చాలా త్వరగా తయారయ్యే, ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇది తేలికగా జీర్ణమవుతుంది. ఉదయం అల్పాహారానికి మంచి ఎంపిక. తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో ఈ రుచికరమైన వంటకం తయారు చేసుకోవచ్చు..
ఇంటర్నెట్ డెస్క్: అటుకుల ఉప్మా ఎప్పుడైనా తిన్నారా? ఇది తక్కువ సమయంలో సులభంగా తయారయ్యే రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం. ఉదయం బిజీ సమయంలో కూడా తక్కువ పదార్థాలతో త్వరగా తయారు చేసుకోవచ్చు. సరైన విధానంలో తయారు చేస్తే అటుకుల ఉప్మా రుచిగా ఉండటంతో పాటు ఆనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ వంటకం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అవసరమైన పదార్థాలు
అటుకులు – 2 కప్పులు
వేరుశెనగలు - 1/2 కప్పు
ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి – 2 (తరిగినవి)
కరివేపాకు – కొద్దిగా
ఆవాలు – 1/2 టీ స్పూన్
జీలకర్ర – 1/2 టీ స్పూన్
పసుపు – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 2 టీ స్పూన్లు
నిమ్మరసం – 1 టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా (తరిగినది)
తయారీ విధానం..
ముందుగా అటుకులను ఒక గిన్నెలో వేసి నీటితో ఒకసారి కడగాలి. తర్వాత నీటిని వంపేసి 5 నిమిషాలు అలాగే ఉంచాలి. అటుకులు మృదువుగా మారతాయి.
ఒక కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి బాగా వేయించాలి.
ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారిన తర్వాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత వేరుశెనగలు వేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత నానబెట్టిన అటుకులు వేసి మెల్లగా కలపాలి. అటుకులు పగలకుండా జాగ్రత్తగా కలపాలి.
2–3 నిమిషాలు తక్కువ మంటపై ఉంచి, చివరగా నిమ్మరసం, కొత్తిమీర వేసి కలపాలి. ఇంతే.. రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ..
చిట్కాలు..
అటుకులను ఎక్కువసేపు నానబెట్టకండి, లేదంటే అవి ముద్దలా మారుతాయి.
నిమ్మరసం వేయడం వల్ల మంచి రుచి వస్తుంది.
కావాలంటే క్యారెట్, బఠాణీ, జీడిపప్పు వంటివి కూడా కలుపుకోవచ్చు.
అటుకుల ఉప్మా తక్కువ సమయంలో తయారయ్యే ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇది రుచిగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని కూడా ఇస్తుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!