Share News

భారతీయులకంటే ఎక్కువ మద్యం తాగినా.. ఐరోపా వారు సేఫ్! ఎందుకంటే..

ABN , Publish Date - Feb 16 , 2026 | 06:44 PM

ఐరోపా దేశాల వారు భారతీయుల కంటే మద్యం ఎక్కువ తాగినా ఫ్యాటీ లివర్ ముప్పు తక్కువగా ఎందుకు ఉంటుందో వివరిస్తూ ఓ డాక్టర్ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.

భారతీయులకంటే ఎక్కువ మద్యం తాగినా.. ఐరోపా వారు సేఫ్! ఎందుకంటే..
Alcohol Tolerance - Europeans Vs Asians

ఇంటర్నెట్ డెస్క్: మద్యపానంతో కలిగే అనేక అనర్థాల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. కానీ, భారతీయుల (Indians) కంటే ఎక్కువ మొత్తంలో యూరోపియన్లు (Europeans) మద్యం సేవించినా వారికి ఫ్యాటీ లివర్ ముప్పు కాస్త తక్కువే. ఇందుకు కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయంటూ ఓ డాక్టర్ నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Tolerance to Alcohol).

హర్ష్ వ్యాస్ అనే వైద్యుడు ఈ వీడియోను షేర్ చేశారు. ఐరోపా వారికంటే భారతీయులు ఎక్కువగా ఆల్కహాల్ సంబంధిత ఫ్యాటీ లివర్ బారినపడటానికి మూడు ప్రధాన కారణాలని తెలిపారు. ఆయన తెలిపిన దాని ప్రకారం, ఐరోపా వాసుల్లో ఆల్కహాల్ డీహైడ్రోజినేస్, ఆల్డిహైడ్ డీహైడ్రోజినేస్ ఎంజైమ్‌లు మరింత క్రియాశీలకంగా ఉంటాయి. మద్యం కారణంగా ఒంట్లో ఏర్పడే వ్యర్థాలను ఇవి వేగంగా తొలగించేందుకు ఉపకరిస్తాయి. ఆసియా దేశాల వారిలో ఈ ఎంజైమ్‌ల క్రియాశీలత కాస్త తక్కువ. ఫలితంగా వ్యర్థాలు ఎక్కువ సమయం పాటు శరీరంలో నిలిచి ఉండి చేటు చేస్తాయి.


ఐరోపా వాసులు తినే ఆహారంలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్, ఆరోగ్యకర కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వారు చేపలు, ఇతర సీఫుడ్, ఆలివ్ ఆయిల్‌ను ఎక్కువగా తినడమే ఇందుకు కారణం. దీంతో, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి. భారతీయులు తినే ఆహారాల్లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్‌లు ఎక్కువ అని హర్ష్ వ్యాస్ తెలిపారు. అంతేకాకుండా, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు తక్కువగా ఉంటాయి. ఫలితంగా లివర్‌లో కొవ్వు ఎక్కువగా పేరుకుని ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తుందని తెలిపారు.

ఇక ఐరోపా వాసుల్లో అధిక శాతం మంది కసరత్తులపై దృష్టి పెడతారని ఆ డాక్టర్ అన్నారు. భారతీయుల్లో చాలా మంది సరిగా కసరత్తులు చేయరని, కనీసం రోజుకు ఐదు కిలోమీటర్ల దూరం కూడా నడవరని తెలిపారు. 37 ఏళ్ల ఐరోపా వ్యక్తి, అదే వయసున్న ఓ భారతీయుడి లివర్ అల్ట్రాన్ సాన్స్ రిపోర్టులను పోల్చి చెబుతూ ఈ విషయాలను హర్ష్ వ్యాస్ వెల్లడించారు.


Also Read:

వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? లైఫ్‌లో ఒక్కసారైనా ఈ టౌన్‌కు వెళ్లి రావాలి!

మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..

For More Lifestyle News

Updated Date - Feb 16 , 2026 | 06:51 PM