అతిగా ఫోన్ చూస్తున్నారా? అయితే ఈ 6 నష్టాలు తప్పవు
ABN , Publish Date - Nov 09 , 2026 | 06:47 PM
అవసరం ఉన్నా.. లేకున్నా.. ఫోన్ చూడడం మనలో చాలామందికి అలవాటు. మెసేజ్ రాదు, కాల్స్ రావు, ఫోన్లో చూసేంత ఇంపార్టెంట్ పనులూ ఏమీ ఉండవు. అయినా సరే.. 5 నిమిషాలకోసారి లాక్ స్క్రీన్ ఓపెన్ చేసి ఫోన్‌ను చెక్ చేస్తూ ఉంటాం. అది వ్యసనంలా మారిపోయింది. ఈ వ్యసనం వల్ల ఎన్ని నష్టాలో మీకు తెలుసా..
అవసరం ఉన్నా.. లేకున్నా.. ఫోన్ చూడడం మనలో చాలామందికి అలవాటు. మెసేజ్ రాదు, కాల్స్ రావు, ఫోన్లో చూసేంత ఇంపార్టెంట్ పనులూ ఏమీ ఉండవు. అయినా సరే.. 5 నిమిషాలకోసారి లాక్ స్క్రీన్ ఓపెన్ చేసి ఫోన్‌ను చెక్ చేస్తూ ఉంటాం. అది వ్యసనంలా మారిపోయింది. మద్యానికి బానిస అయినవాడు అది లేకుండా ఎలా ఉండలేడో.. ఫోన్ లేకుండా మనలో చాలామంది ఒక్క నిమిషం కూడా ఉండలేరు. అస్తమానం ఫోన్ చూడడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందామా..
1. కంటి మీద ఒత్తిడి కలుగుతుంది.
చిన్న స్క్రీన్‌ను ఎక్కువ సమయం అదేపనిగా రెప్ప ఆర్పకుండా చూడడం వల్ల కంటి మీద తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. ఫోన్ స్క్రీన్స్ నుంచి విడుదల అయ్యే నీలికాంతి కంటి మీదపడి కంటిచూపుపై ప్రభావం చూపిస్తుంది. కళ్లల్లో నుంచి నీళ్లు కారడం, కళ్ల మంట, కళ్లు పొడిబారడం, తలనొప్పి, దృష్టి లోపాలు కలగడం వంటి వ్యాధులు రావడానికి కారణమవుతాయి.
నివారణ: స్క్రీన్ పెద్దగా పెట్టుకోవడం, బ్రైట్నెస్ తగ్గించుకోవడం, అదేపనిగా ఫోన్ చూడకుండా..తరచుగా బ్రేక్ ఇవ్వడం, నీలికాంతి నుంచి కళ్లను కాపాడుకునేందుకు కళ్లద్దాలను వినియోగించడం వంటి సూచనలు తప్పకుండా పాటించాలి.
2. మెడ నొప్పి
ఫోన్ ఉపయోగిస్తూ.. అందులోనే లీనమై పోతూంటాం. ఎలా కూర్చొన్నాం.. ఎక్కడ కూర్చొన్నాం.. అనే స్పృహ మనలో చాలా మందికి ఉండదు. టెక్స్ట్ టైప్ చేసేటప్పుడు, రీల్స్ చూసేటప్పుడు.. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చుని ఉంటాం. దీని వల్ల కండరాలు బిగుసుపోయి.. భుజాల నొప్పి, మెడ నొప్పి, నడుం నొప్పి వంటి వ్యాధులు కలుగుతాయి. చిన్న వయసులోనే మెడ, నడుం వంగిపోతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే.. దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి.
నివారణ: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, చిన్నపాటి స్ట్రెచింగ్ చేయడం, సరైన భంగిమలో కూర్చోవడం వంటివి చేయాలి.
3. నిద్రలేమి
ఒకప్పుడు కుటుంబసభ్యులంతా రాత్రి భోజనం చేసి.. ఆరుబయట కబుర్లు చెబుతూ పడుకునేవారు. కానీ నేడు.. ఇంట్లో ఎంత మంది ఉంటే అన్నీ ఫోన్లు ఉంటున్నాయి. ఎవరి ఫోన్ ప్రపంచంలో వారు మునిగిపోతున్నారు. నిద్రపోయే ముందు కూడా ఫోన్ చూస్తూ పడుకుంటున్నారు. నిద్రలేమి రావడానికి ఇదొక కారణమని నిపుణులు తెలుపుతున్నారు. నిద్రపోవడానికి కనీసం 30 నిమిషాల వరకు ఫోన్ స్క్రీన్ కు దూరంగా ఉండడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని వెల్లడిస్తున్నారు. ‘ఫోన్ నుంచి వెలువడే నీల రంగు కాంతి.. నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి ఆటంకాన్ని కలిగిస్తుంది. దీని వల్ల నిద్రపోవడం కష్టమవుతుంది. ఇది దీర్ఘకాల ప్రభావాన్ని చూసి నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది.
నివారణ: ఈ సమస్యను నివారించేందుకు నిద్రపోవడానికి అరగంట ముందు వరకూ ఫోన్‌ను వాడకూడదు.
4. గుండె సమస్యలు
ఫోన్‌కు గుండెకు ఏం సంబంధం ఉందని అనుకోకండి. ఓ అధ్యయనం ప్రకారం అస్తమానం ఫోన్ చూస్తూ గడిపే వారితో పోలిస్తే.. మిగతా వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉన్నట్లు తేలింది. షుగర్, ధూమపానం చేసేవారిలో ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉందని పరిశోధనలో వెల్లడైంది.
నివారణ: వీలైనంత వరకూ ఫోన్ల వాడకం తగ్గించడం వల్ల గుండె సమస్యలను దూరం పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
5. మానసిక ఒత్తిడి
ఈ మెయిల్స్, నోటిఫికేషన్లు, లైక్స్, షేర్స్, కామెంట్ల వలలో చిక్కుకుని.. చాలా మంది తీవ్ర ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఆందోళన కాలక్రమంలో దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది. మానవ సంబంధాలు దెబ్బతినడం, పని ఒత్తిడి, ఒంటరితనం, ఆత్మన్యూనతాభావం వంటి ఆందోళనకరమైన జీవితాన్ని గడుపుతూ.. ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు.
నివారణ: మానసిక ఆరోగ్యాన్ని పొందడం కోసం ఫోన్ల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం శ్రేయస్కరం. ఖాళీ సమయాల్లో ఫోన్ చూడకుండా.. పేయింటింగ్స్ వేయడం, సంగీతం నేర్చుకోవడం, గార్డెనింగ్ చేయడం లాంటి హాబీలను అలవర్చుకోవాలి.
6. వ్యసనం
మద్యపానానికి బానిస అయినవారు.. అది లేకుండా ఎలా ఉండలేరో.. మొబైల్ ఫోన్‌కు బానిస అయినవాళ్ళు కూడా ఫోన్ లేకుండా ఉండలేరు. ఉదయం లేచింది మొదలు.. రాత్రిపడుకునే వరకూ.. ఫోన్ చేతిలో ఉండాల్సిందే. తింటున్నప్పుడు, ఎదుటివారితో మాట్లాడుతున్నప్పడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు.. చివరకి వాష్ రూంల్లోకి కూడా మొబైల్ ఫోన్ వచ్చేసింది. మన మెదడు నియంత్రణలో లేని ఏ పనినైనా వ్యసనం కిందనే పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ చార్జింగ్ అయిపోయినా.. పాడై పోయినా, తమ అందుబాటులో లేకపోయినా విపరీతంగా ఆందోళన చెందుతుంటారు. తమకు తెలియకుండానే నియంత్రణను కోల్పోతారు.
నివారణ: మాదకద్రవ్యాల వ్యవసాన్ని పోలిన ఫోన్ వ్యసనం బారి నుంచి తప్పించుకోవాలి. దీనికోసం వీలైనంతగా మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి. అత్యవసరం అయితే తప్ప ఫోన్‌ను వినియోగించకూడదు.