Share News

అమెరికా బెదిరింపులకు లొంగేది లేదు.. SCO సమ్మిట్‌లో ఇరాన్ ప్రకటన

ABN , Publish Date - Jul 25 , 2026 | 08:58 AM

వాషింగ్టన్ తెస్తున్న ఒత్తిడి, బెదిరింపు రాజకీయాలకు ఇరాన్ ఎప్పటికీ తలొగ్గదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. 'షాంఘై సహకార సంస్థ' విదేశాంగ మంత్రుల సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

అమెరికా బెదిరింపులకు లొంగేది లేదు.. SCO సమ్మిట్‌లో ఇరాన్ ప్రకటన
Iran's Araghchi Rejects Washington's Pressure

బిష్కెక్ (కిర్గిజిస్తాన్), జులై 25: వాషింగ్టన్ తెస్తున్న ఒత్తిడి, బెదిరింపు రాజకీయాలకు ఇరాన్ ఎప్పటికీ తలొగ్గదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. 'షాంఘై సహకార సంస్థ' విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.


ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరగకపోవడానికి మార్గాలు లేకపోవడం కారణం కాదని, అమెరికా నిరంతరం ఉపయోగిస్తున్న 'బెదిరింపులు, బలవంతపు ఒత్తిళ్ల ధోరణి' మాత్రమే ప్రధాన సమస్య అని అరాఘ్చీ విమర్శించారు. 'ఇరాన్ ప్రజల ప్రయోజనాలను, హోర్ముజ్ జలసంధిలో (Strait of Hormuz) దేశ రక్షణను కాపాడుకోవడమే మా ప్రాథమిక సూత్రం. బెదిరింపులకు మేము భయపడేది లేదు' అని ఆయన తేల్చిచెప్పారు.


SCO ఒక ప్రగతిశీల సంస్థ అని పేర్కొంటూ.. అంతర్జాతీయ సంబంధాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న అమెరికా, పాశ్చాత్య దేశాల ఏకపక్ష వైఖరిని సభ్య దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ లతో పాటు పాకిస్తాన్, ఈజిప్ట్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ మంత్రులతో అరాఘ్చీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.


ఒకవైపు దౌత్యపరమైన ప్రకటనలు వస్తుండగానే, మరొకవైపు అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్ మిలిటరీ లక్ష్యాలపై అమెరికా దళాలు వైమానిక దాడులు పూర్తి చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. కాగా, బందర్ అబ్బాస్ ప్రాంతంలో జరిగిన ఈ దాడుల్లో కనీసం ఇద్దరు గాయపడ్డారు. అలాగే ఇరాన్ గ్యాస్‌ను తరలిస్తోందన్న అనుమానంతో ఒమన్ సముద్రంలో ప్రవేశిస్తున్న ఒక LPG ట్యాంకర్‌పై అమెరికా రెండు మిస్సైళ్లతో దాడి చేసింది.


అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ ఆర్మీ 'ఆపరేషన్ లైట్నింగ్' పేరిట క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. కువైట్‌లోని 'అలీ అల్-సేలం' ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని 'అల్-జుఫైర్' సైనిక స్థావరం, జోర్డాన్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడులు నిర్వహించింది.


ఈ క్రమంలో ఇరాన్ ఖాతామ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ కమాండర్ మేజర్ జనరల్ అబ్దొల్లాహి అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. 'అమరుడైన ప్రతి ఇరాన్ పౌరుడికి బదులుగా ఒక అమెరికన్ సైనికుడిని లక్ష్యంగా చేసుకుంటాం. అమెరికా సైనికుల కోసం నరకానికి ఉచిత, డైరెక్ట్ టికెట్లు సిద్ధం చేశాం' అని ఆయన హెచ్చరించారు. దౌత్యపరంగా విదేశాంగ అధికారులు, సరిహద్దుల్లో సైనిక దళాలు దేశ సార్వభౌమత్వ పరిరక్షణకు ఏకతాటిపై పనిచేస్తున్నాయని ఇరాన్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై కేంద్రానికి లేఖ

శాఖలన్నీ హైడ్రాకు మోకరిల్లాయి

Updated Date - Jul 25 , 2026 | 09:39 AM