గురుద్వారాలో కత్తులు, తుపాకులతో దాడి.. వైరల్ అవుతున్న వీడియో..
ABN , Publish Date - Apr 21 , 2026 | 08:28 AM
జర్మనీలోని ఓ గురుద్వారాలో తుపాకులు, కత్తులతో ఇరువర్గాలు దాడి చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. మోయర్స్ నగరం డ్యూయిస్‌బర్గ్ ప్రాంతంలో చెలరేగిన ఈ హింసాత్మక ఘర్షణలో సుమారు 11మంది తీవ్రంగా గాయపడ్డారు.
బెర్లిన్: జర్మనీలోని ఓ గురుద్వారాలో తుపాకులు, కత్తులతో ఇరువర్గాలు దాడి చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. మోయర్స్ నగరం డ్యూయిస్‌బర్గ్ ప్రాంతంలో చెలరేగిన ఈ హింసాత్మక ఘర్షణలో సుమారు 11మంది తీవ్రంగా గాయపడ్డారు. గురుద్వారా నిధులు, కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఎన్నిక కారణంగానే ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సోమవారం నాడు జరిగిన ఈ ఘర్షణలో సుమారు 40మంది కత్తులు, తుపాకులతో దాడి చేసుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి.
కొన్నాళ్లుగా ప్రస్తుత, మాజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మధ్య వివాదం నడుస్తోందని గురుద్వారాకు చెందిన ఓ వ్యక్తి స్థానిక మీడియాకు తెలిపాడు. గురుద్వారా నిధులు, ఆధిపత్య పోరు విషయంలో ఘర్షణ తలెత్తినట్లు చెప్పుకొచ్చాడు. ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన దాడిగా తెలిపాడు. ప్రార్థనా సమయంలో ఓ వర్గం వారు కత్తులు, తుపాకులు, పెప్పర్ స్ప్రే తీసుకుని ఆలయం లోపలికి వచ్చినట్లు అతను చెప్పాడు. అనంతరం నిందితుల్లో ఒకరు తుపాకీతో ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు పేర్కొన్నాడు. మరికొంతమంది ప్రత్యర్థుల కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి కత్తులతో దాడికి దిగారని తెలిపాడు. ఇరువర్గాల మధ్య ఘర్షణ ప్రారంభం కాగానే చాలా మంది భయంతో ఆలయం నుంచి పారిపోయారని వెల్లడించాడు. లేకుండా తీవ్ర ప్రాణనష్టం జరిగేదని పేర్కొన్నాడు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులకు అక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. నిందితుల్లో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎవరిపై ఎవరు దాడి చేశారనే దానిపై స్పష్టత లేదని, కాల్పులు జరిగిన తుపాకీ కూడా ఇంకా లభ్యం కాలేదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన రైలు.. రైతుకు తీవ్రగాయాలు..
సినీనటి అనసూయపై అసభ్యకర కామెంట్లు..