Share News

చర్చలపై సస్పెన్స్‌!

ABN , Publish Date - Apr 21 , 2026 | 03:27 AM

అమెరికా-ఇరాన్‌ మధ్య రెండో దఫా చర్చలపై సందిగ్ధత కొనసాగతోంది. చర్చల కోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నేతృత్వంలో తమ ప్రతినిధులు పాకిస్థాన్‌కు వెళ్లారని ట్రంప్‌ సోమవారం తెలిపారు.

చర్చలపై సస్పెన్స్‌!

  • రేపు ముగియనున్న కాల్పుల విర మణ ఒప్పందం గడువు

వాషింగ్టన్‌/ టెహ్రాన్‌ ఏప్రిల్‌ 20: అమెరికా-ఇరాన్‌ మధ్య రెండో దఫా చర్చలపై సందిగ్ధత కొనసాగతోంది. చర్చల కోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నేతృత్వంలో తమ ప్రతినిధులు పాకిస్థాన్‌కు వెళ్లారని ట్రంప్‌ సోమవారం తెలిపారు. ‘వాళ్లు (ఇరాన్‌) చర్చలకు రావటంలేదని ప్రకటించినప్పటికీ వస్తారనే ఆశిస్తున్నా. అక్కడికి వాళ్లు రావాలి. మేం ఒప్పందం చేసుకోవాలి. వాళ్లు చర్చలకు రాకపోయినా మంచిదే. ప్రస్తుత ఒప్పందం ముగిసిన వెంటనే ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిప్తాం’ అని ట్రంప్‌ హెచ్చరించారు. ట్రంప్‌ వైఖరిని నిరసించిన ఇరాన్‌.. షరతులతో చర్చలు సాగవని, తాము చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో రెండో దఫా చర్చలు కొనసాగుతాయా.. లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం గడువు బుధవారంతో ముగుస్తుంది.

హోర్ముజ్‌లో ఇరాన్‌ నౌక స్వాధీనం

చర్చలపై ప్రతిష్టంభన నేపథ్యంలో హోర్ముజ్‌ జలసంధిలో యుద్ధ వాతావరణం నెలకొంది. కొద్దిరోజులుగా ఇరాన్‌ నౌకాశ్రయాలను అమెరికా నౌకాదళం దిగ్బంధించి.. ఇరాన్‌ నౌకలను అరేబియా సముద్రంలోకి రాకుండా వెనక్కు తిప్పి పంపుతోంది. ఆదివారం మరో అడుగు ముందుకేసి ఇరాన్‌కు చెందిన సరుకు రవాణా నౌక తౌష్కను బలప్రయోగం ద్వారా స్వాధీనం చేసుకుంది. ఇరాన్‌ నుంచి బయలుదేరిన తౌష్క నౌక అమెరికా నిర్బంధాన్ని లెక్కచేయకుండా హోర్ముజ్‌ను దాటేందుకు ప్రయత్నించింది. అమెరికా నేవీకి చెందిన యుద్ధ నౌకలు దానిని ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా ఒమన్‌ గల్ఫ్‌లోకి ప్రవేశించింది. ఆరు గంటలపాటు కొనసాగిన హైడ్రామా తర్వాత.. చివరకు అమెరికా నేవీ సిబ్బంది హెలికాప్టర్‌ ద్వారా తౌష్కపై దిగి కాల్పులు జరిపి తమ అధీనంలోకి తీసుకున్నారు. తౌష్కలోని ఇంజన్‌ గది తలుపులు పేల్చివేసి ఆ నౌకను నియంత్రణలోకి తీసుకున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అమెరికా చర్యకు ప్రతీకారంగా ఐఆర్‌జీసీ ఎదురు దాడులు మొదలుపెట్టినట్లు సమాచారం. అమెరికా యుద్ధ నౌకలపై డ్రోన్లతో దాడులు చేసినట్లు తెలిసింది. తౌష్కను అమెరికా స్వాధీనం చేసుకొన్న కొద్దిసేపటికే ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌.. పాకిస్థాన్‌ ప్రధాని షరీఫ్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. రెండు దేశాల విదేశాంగ మంత్రులు కూడా ఫోన్లో చర్చలు జరిపినట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది. అమెరికాతో ఇకపై చర్చలు ఉండవని ఆ దేశ అధికార వార్తా సంస్థ ఇర్నా తెలిపింది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్‌లో 3,375 మంది, లెబనాన్‌లో 2,290 మంది, ఇజ్రాయెల్‌లో 23 మంది మరణించారు. 13మంది అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.


చర్చలకు పోర్టుల నిర్బంధమే అడ్డు..

రెండో దఫా చర్చలకు హోర్ముజ్‌పై అమెరికా నిర్బంధమే అడ్డుగా ఉందని ట్రంప్‌కు పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు అసిమ్‌ మునీర్‌ చెప్పినట్లు సమాచారం. ట్రంప్‌తో మునీర్‌ సోమవారం ఫోన్‌లో మాట్లాడారని పాక్‌ అధికార వర్గాలు తెలిపాయి. ఇరాన్‌ నౌకాశ్రయాల దిగ్బంధనాన్ని తొలగిస్తే ఆ దేశం చర్చలకు వచ్చే అవకాశం ఉందని మునీర్‌ చెప్పగా, ఆ విషయాన్ని పరిశీలిస్తానని ట్రంప్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, అమెరికా- ఇరాన్‌ మధ్య ఎలాంటి శాంతి ఒప్పందం కుదిరినా.. హోర్ముజ్‌ జలసంధిలో టోల్‌ ఫీజు వసూలు చేయకుండా, స్వేచ్ఛాయుత నౌకా రవాణాకు అవకాశం ఉండాలని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి యెవెట్టీ కూపర్‌ అన్నారు. హోర్ముజ్‌ అంతర్జాతీయ జలమార్గమని, దానిలో ఆంక్షలు విధించే అధికారం ఎవరికీ లేదని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ప్రకటించారు. ఇదిలా ఉండగా జలసంధిలో భారతీయ నౌకలపై ఇరాన్‌ బలగాలు కాల్పులు జరిపిన ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయెల్‌ బఘే సోమవారం తెలిపారు.

మళ్లీ పెరిగిన చమురు ధరలు

హోర్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలపై కాల్పులు, ఇరాన్‌ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవటం వంటి ఘటనలతో చమురు ధరలు సోమవారం దాదాపు 7 శాతం పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు బెంచ్‌మార్క్‌గా ఉన్న బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారెల్‌కు 90.40 డాలర్ల నుంచి 94.69 డాలర్లకు పెరిగింది.

Updated Date - Apr 21 , 2026 | 03:27 AM