ట్రాక్టర్‌ను ఢీకొట్టిన రైలు.. రైతుకు తీవ్రగాయాలు..
ABN , Publish Date - Apr 21 , 2026 | 08:52 AM
నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి వద్ద రైలు ప్రమాదం సంభవించింది. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తూ రైల్వే ట్రాక్ దాటుతున్న రైతును రైలు ఢీకొట్టింది.
నంద్యాల: సంజామల మండలం రెడ్డిపల్లి వద్ద రైలు ప్రమాదం సంభవించింది. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తూ రైల్వే ట్రాక్ దాటుతున్న రైతును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నదాత తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రెడ్డిపల్లికి చెందిన రైతు రామచంద్రారెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం ఇవాళ(మంగళవారం) ఉదయం పొలానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. తన ట్రాక్టర్ నడుపుకుంటూ చేనుకు బయలుదేరాడు.
అయితే, మార్గమధ్యంలో రైల్వే ట్రాక్ దాటాల్సి ఉండగా.. గేటు వేయకపోవడంతో ముందుకెళ్లిపోయాడు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ గూడ్స్ రైలు.. రైతు ప్రయాణిస్తున్న ట్రాక్ట్రర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పల్టీలు కొట్టి రామచంద్రారెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు, రైతులు బాధితుడిని హుటాహుటిన కోవెలకుంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడి
సినీనటి అనసూయపై అసభ్యకర కామెంట్లు..