వియత్నాంలో ఘోర బస్సు ప్రమాదం.. మంటల్లో చిక్కుకుని ఏడుగురి మృతి
ABN , Publish Date - Jul 21 , 2026 | 08:56 PM
వియత్నాంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ వియత్నాంలో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు..
ఇంటర్నెట్ డెస్క్: వియత్నాంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ వియత్నాంలో ఓ ప్రయాణికుల బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. లామ్ డాంగ్ ప్రావిన్స్ నుంచి దేశంలోని ప్రముఖ వ్యాపార కేంద్రం హోచిమిన్ సిటీకి వెళ్తున్న 24 సీట్ల బస్సులో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు మొత్తం బస్సును చుట్టుముట్టడంతో ప్రయాణికులు బయటకు వచ్చేలోపే పరిస్థితి అదుపు తప్పింది. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణికులు లోపలే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. గాయపడిన వారిని అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చి బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సులో మంటలు ఎలా చెలరేగాయి? సాంకేతిక లోపమా లేదా మరేదైనా కారణమా అనే కోణాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్యూమరేషన్ ఫామ్‌లు త్వరగా బీఎల్‌వోలకు ఇవ్వాలి: ప్రజలకు ఆర్వీ కర్ణన్ సూచన
పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న హరీశ్ రావు: మంత్రి ఉత్తమ్
Read Latest Telangana News And Telugu News