Share News

60 రోజుల గడువు.. ఈ చట్టం అమెరికా అధ్యక్షుడిని ఆపగలదా..

ABN , Publish Date - May 02 , 2026 | 01:45 PM

ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో, అమెరికాకు సంబంధించిన ఒక కీలక చట్టం గురించి చర్చ మొదలైంది. అదే వార్ పవర్ చట్టం (1973). ఈ చట్టం ప్రకారం, కాంగ్రెస్ అనుమతి లేకుండా అమెరికా అధ్యక్షుడు యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేడు.

60 రోజుల గడువు..  ఈ చట్టం అమెరికా అధ్యక్షుడిని ఆపగలదా..
Trump Iran conflict

ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో, అమెరికాకు సంబంధించిన ఒక కీలక చట్టం గురించి చర్చ మొదలైంది. అదే వార్ పవర్ చట్టం (1973). ఈ చట్టం ప్రకారం, కాంగ్రెస్ అనుమతి లేకుండా అమెరికా అధ్యక్షుడు యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టం వాస్తవంగా ఎంతవరకు అమలవుతోంది అన్నది పెద్ద ప్రశ్నగా మారింది (War Powers Resolution explained).


వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏకపక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. యుద్ధంపై తుది నిర్ణయం ఒక్క అధ్యక్షుడి చేతిలోనే కాకుండా, ప్రజల ప్రతినిధులైన కాంగ్రెస్ చేతుల్లో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించారు (60 day war powers deadline).


ఈ చట్టం ప్రకారం అమెరికా అధ్యక్షుడు సైనిక చర్యలు ప్రారంభించిన 48 గంటల్లో కాంగ్రెస్‌కు సమాచారం ఇవ్వాలి. కాంగ్రెస్ అనుమతి లేకుండా గరిష్ఠంగా 60 రోజుల వరకు మాత్రమే యుద్ధాన్ని కొనసాగించవచ్చు. ఆ తర్వాత సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి మరో 30 రోజుల గడువు తీసుకోవచ్చు. అంటే మొత్తం మీద 90 రోజుల్లో యుద్ధాన్ని ముగించాలి లేదా కాంగ్రెస్ నుంచి అధికారిక అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం ఇరాన్‌తో అమెరికా యుద్ధం ప్రారంభమై 60 రోజులు దాటింది. ఈ యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి లేదు (Trump Iran conflict).


ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కీలక వాదనను ముందుకు తెచ్చింది. ఏప్రిల్‌లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతోనే యుద్ధం ముగిసిందని, ఆ తర్వాత సైనిక చర్యలు జరగలేదని పేర్కొంది. అంటే యుద్ధం సాంకేతికంగా కొనసాగడం లేదని, కాబట్టి 60 రోజుల గడువు నియమం వర్తించదని అంటున్నారు. అంతేకాకుండా, కొంతమంది ట్రంప్ మద్దతుదారులు మరింత ముందుకు వెళ్లి ఈ చట్టమే రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నారు. సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్ అయిన అధ్యక్షుడికి యుద్ధ నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండాలని వాదిస్తున్నారు. కాంగ్రెస్ ఆ అధికారాన్ని పరిమితం చేయడం సరైంది కాదని అంటున్నారు (US Congress vs President war powers).


ఈ చట్టం అధ్యక్షుడిని పూర్తిగా ఆపగలదా అంటే.. సైద్ధాంతికంగా 'అవును' అనే సమాధానమే వస్తుంది (President war powers). అయితే ప్రాక్టికల్‌గా మాత్రం అంత సులభం కాదు. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌లో విభేదాలున్నాయి. పైగా ట్రంప్‌నకు తన పార్టీ అభ్యర్థుల మద్దతు ఉంది. దీంతో అధ్యక్షుడిని కాంగ్రెస్ నియంత్రించలేదు. అలాగే, ఈ చట్టం ఉల్లంఘన జరిగితే ఏం చేయాలనే విషయంలో స్పష్టత లేదు. అధ్యక్షుడు చట్టాన్ని పక్కనబెట్టినా వెంటనే ఆపే వ్యవస్థ బలంగా లేదు. గతంలో కూడా అనేక మంది అమెరికా అధ్యక్షులు ఈ చట్టాన్ని వివిధ విధాలుగా దాటవేశారు. రకరకాల సాంకేతిక కారణాలు చెప్పి ఈ చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిని ఈ చట్టం ఆపగలదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.


ఇవి కూడా చదవండి..

ఒప్పందం కుదరకపోతే ఇతర మార్గాలు.. ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్..


బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 02 , 2026 | 01:49 PM