Share News

అమెరికాలో ఈవీఎంలు లేకుండానే గంటల్లో ఫలితాలు.. కోట్లాది ఓట్ల లెక్కింపు ఇంత వేగంగా ఎలా..

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:29 PM

మనదేశంలో ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంలు)ను వినియోగించడంతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఫలితాలు వెలువడుతాయి. అయితే అమెరికాలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది.

అమెరికాలో ఈవీఎంలు లేకుండానే గంటల్లో ఫలితాలు.. కోట్లాది ఓట్ల లెక్కింపు ఇంత వేగంగా ఎలా..
US Elections 2026

ఇంటర్నెట్ డెస్క్: మనదేశంలో ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంలు)ను వినియోగించడంతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఫలితాలు వెలువడుతాయి. అయితే అమెరికాలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ ఓటర్లు కాగితపు బ్యాలెట్ పత్రాలపైనే ఓటు వేస్తారు. అయినప్పటికీ లక్షలాది, కోట్లాది ఓట్ల లెక్కింపు వేగంగా జరుగుతుంది. అసలు అమెరికాలో ఈవీఎంలు లేకుండా ఓట్లను ఎలా లెక్కిస్తారు? ఫలితాలు అంత త్వరగా ఎలా వెల్లడవుతాయి? (US Elections 2026)


అమెరికాలో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న పెట్టెలో గుర్తు పెడతారు. అనంతరం ఆ బ్యాలెట్ పత్రాలను ప్రత్యేక స్కానింగ్ యంత్రాల్లోకి పంపిస్తారు. ఈ యంత్రాలు బ్యాలెట్‌పై ఉన్న గుర్తులను స్కాన్ చేసి, అభ్యర్థుల వారీగా ఓట్లను ఆటోమేటిక్‌గా లెక్కిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లోనే స్కానింగ్ జరుగుతుంది. మరికొన్ని చోట్ల ప్రత్యేక లెక్కింపు కేంద్రాలకు బ్యాలెట్ పత్రాలను తరలిస్తారు. పెద్ద లెక్కింపు కేంద్రాల్లో ఉండే హైస్పీడ్ స్కానర్లు గంటకు వేలాది బ్యాలెట్ పత్రాలను పరిశీలించగలవు (EVM vs Ballot Paper).


అమెరికాలో ఓటు వేసేది కాగితంపైనే అయినా, లెక్కించేది మాత్రం యంత్రాలే. అందుకే పెద్ద సంఖ్యలో ఓట్లను తక్కువ సమయంలో లెక్కించడం సాధ్యమవుతోంది. అమెరికాలో ఎన్నికల ఫలితాలు వేగంగా వెల్లడవడానికి మరో ముఖ్యమైన కారణం ముందస్తు ఓటింగ్. అక్కడి రాష్ట్రాల నిబంధనలను బట్టి ఓటర్లు పోలింగ్ రోజుకు ముందే ఓటు వేయవచ్చు. పోస్టు ద్వారా కూడా బ్యాలెట్ పత్రాలను పంపవచ్చు. తాజాగా నవంబర్ 3న జరిగిన మధ్యంతర ఎన్నికలకు ముందే 5.7 కోట్ల మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఫ్లోరిడా యూనివర్సిటీ ఎలక్షన్ ల్యాబ్ వెల్లడించింది (US Paper Ballots).


భారత్‌లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక బాధ్యత వహిస్తుంది (US Vote Counting Process). కానీ అమెరికాలో ఎన్నికల నిర్వహణ ప్రధానంగా రాష్ట్రాలు, స్థానిక సంస్థల పరిధిలో ఉంటుంది. దేశవ్యాప్తంగా వేలాది స్థానిక ఎన్నికల యంత్రాంగాలు ఓట్ల లెక్కింపును నిర్వహిస్తాయి. 2026 మధ్యంతర ఎన్నికల్లో అమెరికా వ్యాప్తంగా 10 వేలకు పైగా స్థానిక లెక్కింపు కేంద్రాల్లో ఓట్ల ప్రక్రియ కొనసాగింది. ప్రతి కేంద్రంలో లెక్కించిన ఓట్ల వివరాలను సంబంధిత అధికారులకు పంపిస్తారు. అక్కడి నుంచి రాష్ట్రస్థాయి ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..


అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్‌ పరిస్థితేంటి..

Updated Date - Nov 04 , 2026 | 04:32 PM