ఇరాన్ కోలుకోవడానికి పదేళ్లు పడుతుంది: ట్రంప్
ABN , Publish Date - Mar 18 , 2026 | 11:44 AM
ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల వల్ల ఇరాన్ భారీగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడులు ఇంకా ముగియలేదని ఆయన స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా చేస్తున్న సంయుక్త దాడులు ఉధృతమయ్యాయి. ఈ దాడుల కారణంగా టెహ్రాన్ భారీగా నష్టపోయింది. ఓవైపు కీలక నేతలు వరుసగా ప్రాణాలు కోల్పోతుండగా... మరోవైపు అణు స్థావరాలు, జనావాసాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై కొనసాగుతున్న తమ సైనిక చర్యలు చాలా బాగా సాగుతున్నాయని, వాటివల్ల కలిగిన నష్టాన్ని పునర్నిర్మించడానికి ఇరాన్‌కు కనీసం ఒక పదేళ్లు పట్టవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
'ఇరాన్‌పై యుద్ధం చాలా బాగా సాగుతోంది. వారి(ఇరాన్) వద్ద అణ్వాయుధాలు ఉండనివ్వకూడదు. భవిష్యత్‌లో వారి నుంచి ఎవరికీ అణుముప్పు రాకూడదనేదే మా లక్ష్యం. మరో రెండు వారాల పాటు ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. మేము ముందస్తు దాడులు ప్రారంభించకపోయి ఉంటే ఇరాన్ ఈ పాటికి పలు అణ్వాయుధాలను అభివృద్ధి చేసేది' అని ట్రంప్ తెలిపారు.
'ఇరాన్‌పై దాడులు ఇంకా ముగియలేదు. ఆ దేశానికి శాశ్వత నష్టం కలిగించడానికి మేము మరిన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడే యుద్ధాన్ని ఆపేసినా ఆ దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి అక్కడి పాలకులకు 10 ఏళ్ల సమయం పడుతుంది. కానీ మరే ఇరాన్ అధ్యక్షుడు ఇలాంటి సాహసం చేసేందుకు ధైర్యం చేయకుండా, అలానే మళ్లీ కోలుకోలేనివిధంగా అక్కడి నేతలకు నష్టం కలిగించాలన్నదే మా ఉద్దేశం' అని ట్రంప్ వెల్లడించారు.
ఇదే సమయంలో హోర్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపడానికి నాటోతో పాటు మిత్రదేశాలు నిరాకరించడంపై ట్రంప్ అసహనం వ్యక్తంచేశారు. ఈ విషయంలో నాటో తెలివితక్కువగా ప్రవర్తిస్తోందన్నారు. హోర్ముజ్ జలసంధిని తెరిపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ తమ మిత్రదేశాలు ముందుకురావట్లేదన్నారు. అయినప్పటికీ తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు.
ఇవి కూడా చదవండి..
సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..
మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..