Share News

సరస్సు పేరు మార్చిన ట్రంప్.. వ్యతిరేకించిన కెనడా

ABN , Publish Date - Aug 28 , 2026 | 10:11 AM

కెనడాను ఇబ్బందిపెట్టేలా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇరుదేశాల సరిహద్దులో ఉన్న లేక్‌ ఆంటారియోను ‘లేక్‌ అమెరికా’గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సరస్సు పేరు మార్చిన ట్రంప్.. వ్యతిరేకించిన కెనడా
Trump Renames Lake

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అంతేకాక పలు దేశాలు వ్యతిరేకిస్తూ ఉంటాయి. తాజాగా లేక్ ఆంటారియో సరస్సును లేక్ అమెరికాగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొత్త ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సరస్సు కెనడా, అమెరికా సరిహద్దుల్లో ఉంది. దీంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కెనడా భగ్గుమంటుంది. న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్‌ క్యాథీ హోచుల్ కూడా ట్రంప్ ఆదేశించినా ఆ సరస్సు పేరు మార్చబోమని పేర్కొన్నారు.


అమెరికా, కెనడా దేశాల మధ్య కొన్నిరోజులుగా వాణిజ్య యుద్ధం నడుస్తూన్న నేపథ్యంలో సరస్సు పేరు మార్చడం గమన్హారం. గతవారం కెనడాతో జరగాల్సిన ట్రేడ్ డీల్ చివరి నిమిషంలో రద్దు కావడంతో ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో కెనడాపై 50 శాతం సుంకాలు విధించారు. కెనడా కూడా అదే స్థాయిలో స్పందించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉన్న ఆంటారియో సరస్సు పేరు మార్చారు.


సరస్సు పేరు మార్పు అంశంపై ట్రంప్ మాట్లాడుతూ... ‘ఈ సరస్సు పేరు మార్పు తక్షణమే అమలులోకి రానుంది. నిజానికి ఎప్పటి నుంచో ఈ పేరు మార్పు ఆలోచన నా మనసులో ఉంది’ అని పేర్కొన్నారు. అలానే సముద్రాల పేర్లను మార్చే విషయాన్ని కూడా పరిశీలిస్తానని ట్రంప్ సూచించారు. సరస్సు పేరు మార్పు నిర్ణయాన్ని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ తీవ్రంగా వ్యతిరేకించారు.


‘అమెరికా మారుతోందని మాకు తెలుసు. వారి వాణిజ్య సంబంధాలు, విదేశాంగ విధానాలు, స్మారక చిహ్నాలు, వారి నదుల పేర్లు.. ఇలా చాలా మారుతున్నాయి. కెనడా, అమెరికా ఏర్పడకముందే ఈ సరస్సు పేరు ఆంటారియోగా ఉంది. ఎప్పటికీ అది అలాగే ఉంటుంది’ అని కెనడా ప్రధాని స్పష్టం చేశారు. కెనడాలోని ఆంటారియో, అమెరికాలోని న్యూయార్క్ మధ్య ఈ సరస్సు ఉంది. ఉత్తర అమెరికాలో ఉన్న ఐదు ప్రముఖ సరస్సుల్లో ఇది ఒకటి. ఆంటారియో సరస్సు 52 శాతం కెనడాలో మిగిలిన భాగం న్యూయార్క్‌లో ఉంది.


ఇవి కూడా చదవండి:

ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేశ్..

రోజుకు 3.70 లక్షల మంది ప్యాసింజర్లు!

Updated Date - Aug 28 , 2026 | 10:32 AM